వావ్ బిగ్-బి.. 850 మంది రైతులకు రుణమాఫీ

వావ్ బిగ్-బి.. 850 మంది రైతులకు రుణమాఫీ

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్తర్ ప్రదేశ్‌ లో 850 మంది రైతుల్ని రుణాల నుంచి విముక్తుల్ని చేయాలని ఆయన సంకల్పించారు. తన సొంత డబ్బులతో వారికి రుణ మాఫీ చేయడానికి ఆయన సిద్ధమయ్యారు.

అన్నదాతల కోసం ఆయన చేపడుతున్న ఈ గొప్ప కార్యక్రమానికి గొప్ప మద్దతు లభిస్తోంది. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రైతు రుణమాఫీ గురించి అమితాబ్ తన బ్లాగ్‌లో వెల్లడించారు.  ఉత్తర్ ప్రదేశ్ లో రుణాల బారిన పడి ఇబ్బంది పడుతున్న దాదాపు 850 మంది రైతులను గుర్తించామని.. వారి తరఫున సుమారు రూ.5.5 కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లించబోతున్నామని అమితాబ్ చెప్పారు. రైతుల్ని ఆదుకోవడానికి అమితాబ్ ముందుకు రావడం ఇది కొత్తేమీ కాదు.

ఇప్పటికే మహారాష్ట్రలో అప్పుల బారిన పడి మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా గుర్తించి వారికి బిగ్‌బీ సాయం అందించారు. 44 కుటుంబాల్ని ఆయన ఆదుకున్నారు. దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న అన్నదాత ఆత్మహత్యలు చేసుకోకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. మహారాష్ట్రలో రైతు కుటుంబాలను ఆదుకోవడంతో తనకు జీవితంలో గొప్ప సంతృప్తి లభించిందని.. అలాగే  ఇతర రాష్ట్రాల్లోని రైతుల్ని కూడా ఆదుకోవాలని నిర్ణయించుకున్నానని అమితాబ్ చెప్పారు.

మరోవైపు బాలికలు వేశ్యావృత్తిలోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి శ్రమిస్తున్న ఓ సంస్థకు కూడా అమితాబ్ తన తోడ్పాటు అందిస్తున్నారు. అమితాబ్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన బాటలో మరిందరు సినీ ప్రముఖులు రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English