రామ్-రాజు ఈసారైనా కొడతారా?

రామ్-రాజు ఈసారైనా కొడతారా?

యువ కథానాయకుడు రామ్ కెరీర్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ. అందులోనూ గత ఆరేడేళ్లలో అతడి ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదు. ‘నేను శైలజ’ మినహాయిస్తే అతడికి సరైన విజయమే లేదు. ఆ సినిమా తర్వాతైనా నిలకడ సాధిస్తాడేమో అనుకుంటే.. ‘ఉన్నది ఒకటే జిందగీ’తో మళ్లీ ట్రాక్ తప్పాడు. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘హలో గురూ ప్రేమ కోసమే’ మీదే ఉన్నాయి.

అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో చేసిన సినిమా కావడం.. పైగా ‘సినిమా చూపిస్త మావ’.. ‘నేను లోకల్’ లాంటి హిట్లు కొట్టిన త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో రామ్ హిట్ కొడతానని కాన్ఫిడెంటుగా ఉన్నాడు. ఐతే ఈ సినిమా సక్సెస్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ దగ్గర గొప్పగా పెర్ఫామ్ చేయాలి.

ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని దిల్ రాజు దాదాపు రూ.25 కోట్లకు అమ్మడం విశేషం. రామ్ స్టామినా ప్రకారం చూస్తే ఇది పెద్ద ఫిగరే. ఇప్పటిదాకా రామ్ సినిమా ఏదీ ఆ మార్కును అందుకోలేదు. ‘నేను శైలజ’ కూడా రూ.20 కోట్లే రాబట్టింది. ఇప్పుడు ‘అరవింద సమేత’..‘పందెం కోడి-2’ చిత్రాల పోటీని తట్టుకుని ఈ సినిమా రూ.25 కోట్లు రాబట్టడం అంటే సవాలే. ఐతే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. దసరా సెలవుల అడ్వాంటేజీని వాడుకుని గట్టెక్కేయొచ్చని రాజు అండ్ టీమ్ ఆశిస్తోంది.

ఇంతకుముందు రామ్-రాజు కాంబినేషన్లో వచ్చిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ఫ్లాప్ అయింది. తర్వాత వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మధ్యలో ‘రాజా ది గ్రేట్’ సినిమాను రాజు బేనర్లో రామ్‌యే చేయాల్సింది. కానీ అనివార్య కారణాలతో అందులోంచి రామ్ తప్పుకున్నాడు. చివరికి ఇప్పుడు ‘హలో గురూ ప్రేమ కోసమే’ సెట్టయింది. మరి ఇన్నేళ్ల తర్వాత కలిసిన రామ్-రాజు ఇప్పుడైనా హిట్టు కొడతారేమో చూడాలి.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English