రాజమౌళినీ వదలట్లేదా?

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి బడా హీరోలు.. సుకుమార్, కొరటాల శివ లాంటి టాప్ డైరెక్టర్లతో ఆ సంస్థ సినిమాలు చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్, మహేష్ బాబులతో పుష్ప, సర్కారు వారి పాట చిత్రాలను నిర్మిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతోనూ మైత్రీ సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్-జూనియర్ ఎన్టీఆర్ కలయికలోనూ మైత్రీ ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తోనూ తమ సంస్థలో ఓ సినిమా ఉంటుందని మైత్రీ అధినేతలు ఇంతకుముందే వెల్లడించారు. ఇలా టాప్ హీరోలు, దర్శకులు ఎవ్వరినీ మైత్రీ వాళ్లు వదలట్లేదు. ఇప్పుడు వారి కళ్లు దర్శక ధీరుడు రాజమౌళి మీదా పడ్డట్లు సమాచారం.

తన పాత కమిట్మెంట్లు ఒక్కొక్కటిగా పూర్తి చేసే క్రమంలో ముందుగా డీవీవీ దానయ్యతో ‘ఆర్ఆర్ఆర్’ చేశాడు రాజమౌళి. ఆ తర్వాత మరో సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణకు ఇచ్చిన హామీ మేరకు మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. దీని తర్వాత రాజమౌళి ఏ బేనర్‌కు సినిమా చేస్తాడన్న దానిపై క్లారిటీ లేదు. ఐతే నారాయణ-మహేష్ సినిమా అయ్యాక జక్కన్న మైత్రీ సంస్థలో ఓ మెగా మూవీ చేస్తాడని వార్తలొస్తున్నాయి.

ఇటీవలే రాజమౌళిని మైత్రీ అధినేతలు రవిశంకర్, నవీన్ కలిశారని.. వీరి కలయికలో ఓ సినిమా కోసం సూచనప్రాయంగా అంగీకారం కుదిరిందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మైత్రీ సంస్థలో ఏం చేసినా భారీగానే ఉంటుంది. ఇక రాజమౌళితో సినిమా అంటే ఎన్ని వందల కోట్లయినా బడ్జెట్ పెట్టడానికి వాళ్లు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ బేనర్లో ఒక భారీ పాన్ ఇండియా మూవీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట.