#metoo.. అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం

#metoo.. అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం

కొన్ని రోజులుగా ‘మి టు’ ఉద్యమం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ తనూశ్రీ దత్తా.. నానా పటేకర్ మీద చేసిన ఆరోపణలతో ఈ ఉద్యమం ఊపందుకుంది.

ఇప్పుడు రోజుకో అమ్మాయి సంచలన ఆరోపణలతో మీడియా ముందుకొస్తోంది. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. ‘క్వీన్’ దర్శకుడు వికాస్ బల్.. ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో కెరీరే దెబ్బ తినే స్థితికి చేరుకున్నాడు.

అతను భాగస్వామిగా ఉన్న ‘ఫాంటమ్’ సంస్థ ఈ దెబ్బతో మూత పడింది. హృతిక్ హీరోగా వికాస్ తెరకెక్కిస్తున్న ‘సూపర్ 30’ సినిమా కూడా ప్రమాదంలో పడింది. అతడిని తప్పించి మరో దర్శకుడితో ఈ సినిమా చేసే సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇప్పుడు తాజాగా మరో ప్రముఖ దర్శకుడు లైంగిక వేధింపుల ఆరోపణలతో చిక్కుల్లో పడ్డాడు. అతనే.. ‘ఫస్ గయారే ఒబాబా’.. ‘జాలీ ఎల్ఎల్బీ’ సిరీస్ సినిమాలకు దర్శకత్వం వహించిన సుభాష్ కపూర్. అతడిపై గీతిక త్యాగి అనే అమ్మాయి లైంగిక వేధింపుల ఆరోపణలుచేసింది. గతంలోనే ఆమె సుభాష్ పై ఆరోపణలు గుప్పించింది.
ఈ వివాదానికి సంబంధించి గతంలో ఒక స్టూడియోలో సుభాష్ భార్య ఎదురుగానే గీతిక అతడిని చెంపదెబ్బ కొట్టిన వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది. అది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సుభాష్ తో ‘మొఘల్’ అనే సినిమా తీస్తున్న అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రం నుంచి తాము తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.

ఈ చిత్రానికి గుల్షన్ కుమార్ మరో నిర్మాత. అతను సినిమా నుంచే సుభాష్ ను తప్పిస్తున్నట్లు ప్రకటించాడు. దర్శకుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని తెలియగానే.. కోట్ల రూపాయల ఖర్చుతో ముడిపడ్డ సినిమా నుంచి హఠాత్తుగా తప్పుకోవడం ద్వారా అమీర్ ఖాన్ శభాష్ అనిపించుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు