బాలయ్య సినిమా పేరు.. తారక్‌కు చాలా ఇష్టం

బాలయ్య సినిమా పేరు.. తారక్‌కు చాలా ఇష్టం

నందమూరి తారక రామారావు.. తన కొడుకులందరికీ ‘కృష్ణ’ అనే పదం కలిసొచ్చేలా పేర్లు పెట్టారు. ఐతే ఇప్పుడు హరికృష్ణ కొడుకులందరూ తమ పిల్లలకు ‘రామ్’ అనే పదం కలిసొచ్చేలా పేర్లు పెడుతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తన పెద్ద కొడుక్కి అభయ్ రామ్ అని పేరు పెట్టాడు. చిన్న కొడుక్కి భార్గవ రామ్ అని పెట్టాడు. నందమూరి బాలకృష్ణ ‘భార్గవరాముడు’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన చిన్న కొడుక్కి తారక్ ఆ పేరు పెట్టడం ఆసక్తి రేకెత్తించింది. ఐతే తనకు ఈ పేరు చాలా ఇష్టమైందని అంటున్నాడు తారక్. తమ పిల్లలకు ‘రామ్’ పేరు కలిసొచ్చేలా పేర్లు పెట్టడం.. తన తండ్రి హరికృష్ణకు తమ పిల్లలతో ఉన్న అనుబంధం గురించి ఒక ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడాడు.

‘‘మనవళ్లందరితో నాన్నగారు చాలా క్లోజ్‌. జానకి రామ్‌ అన్న, కల్యాణ్‌ అన్న పిల్లలు, నా పిల్లలు అభయ్‌తో, భార్గవ్‌తో కూడా సరదాగా ఉండేవారు. నా ఆనందమేంటంటే నాన్నగారు నా రెండో అబ్బాయి భార్గవ్‌ని కూడా చూశారు. మా ఇంట్లో జరిగిన అన్ని వేడుకలకు.. ఆ మధ్య జరిగిన భార్గవ్‌ నామకరణ వేడుక వరకూ అన్నింట్లో నాన్నగారు  ఉన్నారు. ఇక మీద జరగబోయే వేడుకల్లో ఉండరు. అది మాకెప్పటికీ కొరతగానే ఉంటుంది. భౌతికంగా మాతో లేకపోయినా మా అందరి జ్ఞాపకాల్లో ఆయన ఎప్పటికీ ఉండిపోతారు. పిల్లలకు పేర్లు పెట్టేటపుడు ఆయన సలహాలు అడిగేవాళ్లం. మా అందరికీ  ఆయన రాముడి పేర్లు పెట్టారు. జానకిరామ్, కల్యాణ్‌ రామ్, తారకరామ్‌ అని. మా పిల్లలకు కూడా మేం అలానే పెట్టాం. జానకిరామ్‌ అన్న కొడుక్కి తారక రామారావు అని, కల్యాణ్‌ అన్న శౌర్యా రామ్‌ అని పేర్లు పెట్టారు. నా పిల్లలకు అభయ్‌ రామ్, భార్గవ రామ్‌ అని నామకరణం చేశా. నాకు చాలా ఇష్టమైన పేరు భార్గవ రామ్‌’’ అని తారక్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English