అఖిల్ రేంజ్ ఏంటో చూపిస్తున్నారా?

అఖిల్ రేంజ్ ఏంటో చూపిస్తున్నారా?

అక్కినేని అఖిల్ కెరీర్ విషయంలో నాగార్జున ఎన్నో కలలు కన్నాడు. ఎంతో ఆశించాడు. అఖిల్ అరంగేట్రం గురించి అప్పట్లో ఎంత చర్చ నడిచిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. లాంచింగ్ కంటే ముందే జాతీయ స్థాయిలో పేరుమోసిన బ్రాండ్లకు ప్రచార కర్తగా వ్యవహరించడం ద్వారా అఖిల్ దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించే ప్రయత్నం చేశాడు. ఇందులో నాగార్జున పాత్ర చాలా ఉందని అంటారు. తన చిన్న కొడుకుని బాలీవుడ్ హీరోను చేయాలని కూడా ఆయన ఆశ పడ్డాడని.. అందుకే తనకున్న పరిచయాలతో ఆయా బ్రాండ్లను అఖిల్‌కు ఇప్పించాడని అంటారు. అఖిల్‌ను కొన్నాళ్లు ముంబయిలో ఉంచి ట్రైనింగ్ ఇప్పించడం.. అక్కడి సెలబ్రెటీలతో కలిపించడం కూడా చేశాడు నాగ్. కానీ ఆయనెంతగా కొడుకుని పుష్ చేసినప్పటికీ.. తొలి సినిమా ‘అఖిల్’ తేడా కొట్టేయడంతో కెరీర్ ముందుకు సాగలేదు.

మళ్లీ రీలాంచింగ్ అంటూ ‘హలో’ తీస్తే అదీ తుస్సుమనిపించింది. ఇప్పుడు ‘మిస్టర్ మజ్ను’ మీద ఎన్నో ఆశలతో ఉన్నారు. ఈ సినిమా సంగతేమవుతుందో కానీ.. అఖిల్‌ను బయట మాత్రం నాగ్ ప్రమోట్ చేయడం ఆపట్లేదు. అఖిల్‌ను హిందీలో లాంచ్ చేయాలని కరణ్ జోహార్ అడుగుతున్నాడని.. తానే ఆపుతున్నానని ఆ మధ్య నాగ్ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు అఖిల్ ట్రాక్ రికార్డు ఎంత పేలవంగా ఉన్నప్పటికీ అతను ప్రకటనల్లో కొనసాగుతూనే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక తాజాగా అఖిల్ రేంజ్ ఇదీ అన్నట్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ రోజు కొన్ని ఫొటోలు రిలీజ్ చేసింది. భారత క్రికెట్ సూపర్ స్టార్.. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో అన్నపూర్ణ స్టూడియోలో చాలా క్యాజువల్‌గా మాట్లాడేస్తున్నాడు అఖిల్. కోహ్లి అనగానే జాతీయ మీడియా మొత్తం ఫోకస్ పెడుతుంది. అతడికి సంబంధించి ఏ విశేషం బయటికి వచ్చినా కోట్ల మంది చూస్తారు. ఈ నేపథ్యంలో అఖిల్‌కు ఫేమ్ తెప్పించడానికి.. అతడి రేంజ్ ఏంటో చూపించడానికి ఇలా చేశారేమో అనిపిస్తోంది వ్యవహారం చూస్తుంటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English