ట్రెండ్‌: నన్నూ లైంగికంగా వేధించారు

ట్రెండ్‌: నన్నూ లైంగికంగా వేధించారు

తనూశ్రీ దత్తా వచ్చి నానా పటేకర్‌ అంతటి ప్రముఖ నటుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణ చేయడంతో తేనెతుట్టెని కదిపినట్టయింది. ఎన్నో ఏళ్లు మౌనం వహించిన చాలా మంది తమ చేదు అనుభవాలని ఏకరవు పెడుతున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు వుండడంతో, ఈ 'ట్రెండ్‌'లోకి అన్ని రంగాల్లోని స్త్రీలు వచ్చి గొంతు కలుపుతున్నారు.

'మీ టూ' ఉద్యమాన్ని ఇండియాలో పాపులర్‌ చేయడానికి, స్త్రీలు ఈ జాఢ్యాన్ని మౌనంగా భరించకుండా వుండడానికి పునాది వేసే ఈ పరిణామం మంచిదే కానీ ఇది వేలం వెర్రిగా మారుతుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఎవరు గొంతు విప్పితే వారికి మీడియా ఫుల్‌ కవరేజ్‌ ఇవ్వడం, అవతలి వారితో చెక్‌ చేసుకోకుండానే వారిని 'దోషి'గా తీర్మానించడం, అన్నిటికీ మించి సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ పెరుగుతుండడంతో పలువురు ఈ ట్రెండ్‌లో తామూ వుండాలంటూ గుర్తు చేసుకుని మరీ గతాన్ని తవ్వుకుని చిన్న, చిన్న విషయాలని కూడా రచ్చ చేస్తున్నారు.

కొందరయితే పరస్పర అంగీకారంతో జరిగిన చర్యలకి కూడా 'లైంగిక దాడి' అనే పేరు పెట్టి మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌పై కక్ష సాధింపుకి దిగుతున్నారు. ఈ జాఢ్యాన్ని సెలబ్రిటీలు గుర్తించకపోలేదు. చిన్న విషయాలని, పాత పగలని వదిలేసి నిజమైన ఉద్యమాన్ని గెలిపించండి అనే నినాదాలకి సమంతలాంటి వారు సపోర్ట్‌ చేస్తున్నారంటే 'మీటూ' దారి తప్పుతోందనే సంగతి స్పష్టమవుతోంది.

అయితే పద్మభూషణ్‌ అవార్డు అందుకుని, ఉత్తమ గేయ రచయితగా నేషనల్‌ అవార్డ్‌ గెలుచుకున్న తమిళ సినీ గేయ రచయిత వైరముత్తులాంటి వారిని చిన్మయి లాంటి పాపులర్‌ సింగర్‌ రచ్చకి ఈడ్చడం లాంటి సంచలనాలకి కూడా ఇది నాంది పలికింది. 'నేనూ వున్నా', 'నన్నూ వేధించారు' అంటూ ప్రతి ఒక్కరూ ట్రెండ్‌ అయిపోవాలని చూడకుండా న్యాయంగా పోరాటం చేస్తోన్న వాళ్లకి అండగా నిలిస్తే దీని వల్ల ఫలితాలుంటాయి. అంతే కానీ ఇలా దారి తప్పిస్తే కొన్నాళ్లకి ఇదీ నీరుగారిపోయి కొందరు మహిళలు చేసిన సాహసం వృధా పోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English