ఫ్రస్టేషన్ కనిపించేస్తోంది రౌడీ..

ఫ్రస్టేషన్ కనిపించేస్తోంది రౌడీ..

విజయ్ దేవరకొండ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. తన కొత్త సినిమా ‘నోటా’ గురించి విడుదలకు ముందు చాలా గొప్పలే పోయాడతను. మీకందరికీ ఒక జబర్దస్త్ సినిమా ఇస్తున్నా అంటూ ప్రి రిలీజ్ ఈవెంట్లలో ఘనమైన ప్రకటనలే చేశాడతను.

కానీ ఈ సినిమా చూసిన జనాలకు దిమ్మదిరిగిపోయింది. విజయ్ ఇలాంటి సినిమా ఎలా చేశాడబ్బా అంటూ ఆశ్చర్యపోయారు. నెగెటివ్ రివ్యూలు రావడమే కాదు.. సోషల్ మీడియాలోనూ జనాలు సినిమాను ఏకేశారు. ముఖ్యంగా విజయ్ తమిళ డైరెక్టర్ బుట్టలో ఎలా పడిపోయాడో చూపిస్తూ.. ‘నేనింతే’ సినిమాలో వేణు మాధవ్ సీన్‌తో పోలుస్తూ మీమ్స్ తయారు చేసి ట్రోల్ చేశారు.

ఐతే ఇంతకుముందు ‘గీత గోవిందం’లో తాను పాడిన పాట విషయంలో ట్రోల్స్ జరిగితే చాలా సరదాగా స్పందించి అందరినీ నవ్వించిన విజయ్.. ఈ సారి మాత్రం భిన్నంగా రెస్పాండయ్యాడు.

అతను ‘నోటా’ ఫలితంపై స్పందిస్తూ రిలీజ్ చేసిన స్టేట్మెంట్లో ఫ్రస్టేషన్ బాగా కనిపించింది. తన ఫెయిల్యూర్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్లు ప్రస్తుతానికి పండగ చేస్కోవాలని.. తాను త్వరలోనే తిరిగొస్తానని అతనన్నాడు. ఐతే తనకు యాంటీ ఫ్యాన్స్ తయారయ్యారని.. తనకంత నెగెటివిటీ ఉందని విజయ్ అసలెందుకు అనుకుంటున్నాడు? విజయ్ మీద విమర్శలు చేసినా.. ట్రోల్స్ నడిచినా.. వాళ్లంతా యాంటీ ఫ్యాన్సేనా? విజయ్ ఇలా అప్పుడే ఒక వర్గానికి చెందిన హీరో అయిపోయాడా? అతడికి వ్యతిరేకంగా కుట్రలు జరిగిపోతున్నాయా? ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి విజయ్ వ్యాఖ్యలు చూశాక.

మరోవైపు విజయ్ ఈ సినిమాను మెచ్చిన వాళ్లకు.. ప్రత్యేకంగా తమిళ జనాలకు థ్యాంక్స్ చెప్పడం కూడా చర్చనీయాంశమవుతోంది. ఇంతకుముందు ‘ద్వారక’ సినిమా ఫెయిలైతే.. విడుదలైన రెండో రోజో మూడో రోజో ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వనందుకు సారీ అని అందరి మన్ననలు అందుకున్నాడు విజయ్. ‘నోటా’ విషయంలో ఓవైపు ఫెయిల్యూర్‌ను అంగీకరిస్తూనే.. మరోవైపు ఈ సినిమాను ఆదరించని తెలుగు ప్రేక్షకులకు పంచ్ ఇచ్చే ప్రయత్నం చేయడం విమర్శలకు దారి తీస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English