ఎంత ధైర్యం.. మూడ్రోజుల ముందే ప్రిమియర్స్

ఎంత ధైర్యం.. మూడ్రోజుల ముందే ప్రిమియర్స్

తెలుగు సినిమాలు ఈ రోజుల్లో అమెరికాలో పెద్ద ఎత్తునే రిలీజవుతున్నాయి. చిన్న స్థాయి సినిమాలైనా సరే.. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఉండేవైతే అక్కడ మంచి వసూళ్లు దక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిన్న స్థాయిలో రిలీజయ్యే సినిమాలకు ప్రిమియర్లు గట్టిగానే పడుతున్నాయి యుఎస్‌లో. ఐతే ప్రిమియర్ల వల్ల కొన్నిసార్లు ప్రమాదం కూడా ఉంటోంది.

సినిమా బాలేకుంటే చాలా ముందుగానే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయి.. ఇక్కడి వసూళ్లపై ప్రభావం పడుతోంది. అదే సమయంలో టాక్ బాగుంటే సినిమాలకు కలిసొస్తోంది కూడా. ఈ ధైర్యంతోనేనేమో ‘వీర భోగ వసంత రాయలు’ టీం తెలుగు రాష్ట్రాల్లో విడుదల కావడానికి మూడు రోజుల ముందే యుఎస్‌లో ప్రిమియర్లకు రెడీ అయిపోతోంది.

నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రియ సరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రాన్ని అక్టోబరు 26న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే అమెరికాలో అక్టోబరు 23నే దీనికి ప్రిమియర్లు వేయబోతున్నారు. ముందే ప్రిమియర్లు పడితే టాక్ బయటికి వచ్చేస్తుంది. సినిమా విశేషాలు కూడా వెల్లడైపోతాయి. దీని వల్ల మంచో చెడో చెప్పలేం.

కానీ చిత్ర బృందం మాత్రం ధైర్యంగా అడుగు వేసేస్తోంది. మంగళవారం ఆఫర్ల వల్ల ప్రిమియర్లకు మంచి స్పందన ఉంటుందని భావిస్తున్నారు. దసరా సినిమాల సందడి అప్పటికి తగ్గి.. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి ఫలితమే రావచ్చు. ఈ నెల 5నే రావాల్సిన ఈ చిత్రాన్ని.. తర్వాత వాయిదా వేశారు. ఇంద్రసేన అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని అప్పారావు బెల్లాన నిర్మించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English