టక్ జగదీష్ : ట్రోలింగ్ పై డైరెక్టర్ రియాక్షన్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమాకి వచ్చిన రివ్యూల సంగతి పక్కన పెడితే.. సినిమాలో కొన్ని అంశాలపై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. నాని సీరియస్ పెర్ఫార్మన్స్ పై కూడా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ.. నాని మాస్ ఎలివేషన్స్ పై దృష్టి పెట్టి.. కొన్ని లాజిక్స్ ను మిస్ చేశాడని అంటున్నారు. పెద్ద కుటుంబాన్ని చూపించే క్రమంలో చాలా మందిని సెట్ చేసి.. వారి మధ్య వరసలను సరిగ్గా చూపించలేకపోయారంటూ విమర్శిస్తున్నారు.

సినిమా చూసిన చాలా మంది అయోమయానికి గురవుతున్నారని.. రివైండ్ చేసుకొని కొన్ని సీన్లు చూస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ పై దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘టక్ జగదీష్’ సినిమాలో ఓ సీన్ ను షేర్ చేస్తూ.. ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారని.. లవ్, హేట్, పాజిటివిటీ, నెగెటివిటీ ఇలా అన్నింటినీ స్ప్రెడ్ చేస్తుంటారని అన్నారు. వాటిని నవ్వుతూ.. ధైర్యంగా, నిజాయితీగా తీసుకోగలగాలని.. దానికి నేను రెడీ అంటూ రాసుకొచ్చారు.

ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నాని ఫ్యాన్స్ సినిమా బావుందని.. ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చుతుందని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు సినిమాలో లోపాలను ఎత్తిచూపిస్తున్నారు. శివ నిర్వాణ గతంలో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. తన తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని రీసెంట్ గా అనౌన్స్ చేశారు ఈ దర్శకుడు.