ఎన్టీఆర్ బాడీగార్డా?

ఎన్టీఆర్ బాడీగార్డా?

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘అరవింద సమేత’ ఇంకొక్క రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్ మీద ముందు నుంచి భారీ అంచనాలుండగా.. సినిమా విడుదల దగ్గర పడేకొద్దీ ఆ అంచనాలు మరింత పెరుగుతూ వచ్చాయి. ఈ సినిమాపై ఉన్న ఆసక్తికి తగ్గట్లే రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపించాయి. అలాగే ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ ఇందులో చిన్నప్పటి తారక్‌గా నటిస్తన్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఐతే ఇవి కేవలం రూమర్లే అని.. అందులో నిజం లేదని తేలింది. ఐతే తాజాగా సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఒక రూమర్ వినిపిస్తోంది.

ఈ చిత్రంలో తారక్.. హీరోయిన్ పూజా హెగ్డే బాడీగార్డుగా కనిపిస్తాడట. ఒక సందర్భంగా పూజను ఎన్టీఆర్ కాపాడితే.. ఆమె కుటుంబం అతడిని బాడీగార్డుగా నియమిస్తుందట. గిల్లి కజ్జాలతో మొదలైన హీరో హీరోయిన్ల ప్రయాణం.. ఆ తర్వాత ప్రేమగా మారుతుందట. ఐతే తర్వాత ఎన్టీఆర్‌లోని మరో కోణం బయటికి వస్తుందట. ‘అరవింద సమేత’ ట్రైలర్లో కనిపించిన దృశ్యాల ప్రకారం ఈ ప్రచారంలో నిజం ఉండేందుకు ఆస్కారముంది. సినిమా తొలి గంట ప్లెజెంట్‌గా, రొమాంటిగ్గా సాగుతుందని.. ఇంటర్వెల్ ట్విస్టు దగ్గర యాక్షన్ బాట పడుతుందని.. ద్వితీయార్ధం చాలా వరకు ఎమోషనల్‌గా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం. చివరి 40 నిమిషాల్లో యాక్షన్ ఘట్టాలేమీ ఉండవని.. హృద్యంగా సాగుతుందని కూడా చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే ఇంకో 40 గంటలు ఆగితే చాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English