విజయ్ దేవరకొండ ఆ నిజాయితీ చూపిస్తాడా?

విజయ్ దేవరకొండ ఆ నిజాయితీ చూపిస్తాడా?

విజయ్ దేవరకొండ చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటాడు చాలాసార్లు. ఈ తరం యువతలో అతడికి బాగా ఫాలోయింగ్ రావడానికి ఇది కూడా ఒక కారణం. తన సినిమా రిలీజైన రెండు రోజులకే ప్రెస్ మీట్లో.. మంచి సినిమా ఇవ్వనందుకు సారీ అని ప్రేక్షకులకు చెప్పడం అతడికే చెల్లింది. ‘పెళ్ళిచూపులు’ తర్వాత వచ్చిన ‘ద్వారక’ విషయంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. బాగా లేని సినిమా గురించి ఇంత ఓపెన్‌గా ఏ హీరో మాట్లాడింది లేదు అప్పటిదాకా. ఐతే విజయ్ ఈ ఒరవడిని తర్వాత కూడా కొనసాగిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ ఎప్పుడో నటించిన ‘ఏం మంత్రం వేసావె’ అనే సినిమా ఒకటి థియేటర్లలోకి వచ్చింది. అది తన స్థాయికి తగ్గ సినిమా కాకపోవడంతో ప్రమోషన్లకు వెళ్లకుండా సైలెంటుగా ఉన్నాడతను. ఆ సినిమా చూడమని ప్రేక్షకులకు అతను చెప్పలేదు.

కట్ చేస్తే ఇప్పుడు ‘నోటా’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు తొలి రోజు నెగెటివ్ టాక్ వచ్చింది. ముందు నుంచి హైప్ ఉండటం వల్ల ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ సినిమా అయితే ప్రేక్షకులకు రుచించేలా లేదన్నది వాస్తవం. కానీ విడుదలకు ముందు తాను అద్భుతమైన సినిమాలో నటించానని.. ప్రేక్షకులకు ఒక జబర్దస్త్ సినిమా ఇస్తున్నానని హామీ ఇస్తున్నానని విజయ్ గొప్పలు పోయాడు. రిలీజ్ ముంగిట ఏం మాట్లాడినా ఓకే అనుకోవచ్చు. ఐతే విడుదల తర్వాత విజయ్ ఏం మాట్లాడతాడన్నది ఆసక్తికరం.

జనాల ఫీడ్ బ్యాక్ ఏంటన్నది అతడికి తెలియకుండా ఉండదు. రివ్యూలన్నీ కూడా దాదాపు నెగెటివ్‌గానే వచ్చాయి. మనోళ్లు తమిళ వాసనలు ఎక్కువయ్యాయని అంటుంటే.. అటు తమిళులు కూడా ఈ చిత్రంపై విమర్శులు గుప్పిస్తున్నారు. రెండు చోట్లా నెగెటివ్ టాకే ఉంది. మరి ఇప్పుడు విజయ్ ‘ద్వారక’ టైంలో మాదిరే సినిమా గురించి నిజాయితీగా మాట్లాడతాడా.. వీకెండ్ వరకు ఆగి.. తర్వాత అయినా ఓపెన్ అవుతాడా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English