క్రిష్‌కే కాదు.. విజయేంద్రకూ చెక్?

క్రిష్‌కే కాదు.. విజయేంద్రకూ చెక్?

టాలీవుడ్లో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన క్రిష్‌కు బాలీవుడ్లో మాత్రం చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఇంతకుముందు అతను అక్కడ తీసిన ‘గబ్బర్’ ఫ్లాప్ అయింది. దీని తర్వాత ‘మణికర్ణిక’ లాంటి ప్రతిష్టాతక ప్రాజెక్టు మొదలుపెడితే.. ఆ సినిమా అనుకోకుండా అతడి చేతుల్లోంచి వెళ్లిపోయింది. క్రిష్ ఫైనల్ ఔట్ పుట్ తీసి ఇచ్చాక.. కంగనా రనౌత్ డైరెక్టర్ కుర్చీలోకి వెళ్లి అందులోంచి కొన్ని సన్నివేశాలు తీసేసి రీషూట్లు చేసింది. దీంతో క్రిష్ హర్టయి.. ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడ్డమే మానేశాడు. అది తన సినిమా కాదన్నట్లుగా ఉంటున్నాడు. ఐతే ఈ రోజు రిలీజైన ‘మణికర్ణి’క టీజర్లో దర్శకుడిగా క్రిష్ పేరే వేశారు. కంగనకు దర్శకత్వంలో క్రెడిట్ ఏమీ ఇవ్వలేదు. ఇన్నాళ్లూ మౌనం వహించిన క్రిష్.. ఈ రోజు ట్విట్టర్లో టీజర్ షేర్ చేయడం ఆసక్తి రేకెత్తించింది.

ఇదిలా ఉంటే.. టైటిల్ క్రెడిట్స్‌లో రచయితగా విజయేంద్ర ప్రసాద్‌తో పాటు ‘బాగ్ మిల్కా బాగ్’కు పని చేసిన రచయిత పేరు కూడా వేశారు. చిత్ర బృందం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విజయేంద్ర ప్రసాద్‌ రాసిన సీన్లను కూడా కొంత మేర కోత పెట్టారట. సోనూ సూద్ మీద తీసిన సీన్లన్నీ విజయేంద్ర ప్రసాద్ రాసినవేనట. క్రిష్-విజయేంద్ర-సోనూ ముగ్గురు కలిసి తమ ఇష్టానికి సీన్లు తీసుకున్నారని భావించి చిత్ర నిర్మాతలు.. కంగనా కలిసి ఆ సీన్లకు కోత వేసినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. వీటి స్థానంలో వేరే రచయితతో వేరే సన్నివేశాలు రాయించి.. వాటిని కంగనా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇవి కాక క్రిష్ సరిగా తీయలేదని భావించిన సీన్లు కూడా రీషూట్ చేశారట. అందుకే విజయేంద్ర ప్రసాద్ సైతం ఈ ప్రాజెక్టు విషయంలో కొంచెం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరి ‘మణికర్ణిక’ సినిమా రిలీజ్ టైంలో క్రిష్, విజయేంద్ర ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English