శంకర్ ఒక రోజు షూటింగ్.. రెండు పెళ్లిళ్లు

శంకర్ ఒక రోజు షూటింగ్.. రెండు పెళ్లిళ్లు

శంకర్ సినిమా అంటే భారీ తనానికి మారు పేరు. తొలి సినిమా ‘జెంటిల్‌మ్యాన్’లోనే విజువల్ గ్రాండియర్ చూపించిన శంకర్.. ఆ తర్వాత సినిమా సినిమాకూ భారీతనం పెంచుతూ వెళ్తున్నాడు. ఇక ‘రోబో’ సినిమాకు వచ్చేసరికి శంకర్ విజన్ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే.

ఇప్పుడు ‘2.0’తో మరోసారి తనదైన శైలిలో మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు శంకర్ ఎంత కష్టపడి ఉంటాడో దీని టీజర్ చూస్తేనే అర్థమైంది. ఒక చిన్న సీన్ తీయాలన్నా వందలమందితో ముడిపడ్డ వ్యవహారమే. అలాంటి వాటిని మేనేజ్ చేయడమంటే చిన్న విషయం కాదు.

మామూలుగా శంకర్ చూడ్డానికి చాలా కూల్‌గా కనిపిస్తాడు కానీ.. షూటింగ్ దగ్గర మాత్రం చండశాసనుడేనట. ఈ విషయాన్ని ఒక నేషనల్ ఛానెల్ ఇంటర్వ్యూలో స్వయంగా శంకరే చెప్పాడు.

తాను ఏ సినిమా తీసినా.. దాని ఒక రోజు షూటింగ్ రెండు పెళ్లిళ్లు చేయడంతో సమానంగా ఉంటుందని శంకర్ చెప్పడం విశేషం. తన ఆలోచనలు భారీగా ఉంటాయని.. ఆ ఇమేజినేషన్‌కు తగ్గట్లుగా సన్నివేశం రావాలంటే వందల మంది పని చేయాల్సి ఉంటుందని శంకర్ చెప్పాడు. అలాంటి సందర్భాల్లో చిన్న విషయం తేడా వచ్చినా మొత్తం నాశనం అయిపోతుందన్నారు. అందుకే తాను చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటానన్నారు.

ఒక పెద్ద భవనంలో షూటింగ్ అనుకుంటే.. తాను ముందుగా దాని వాచ్ మ్యాన్‌ గురించి వాకబు చేస్తానన్నాడు. తామందరం సిద్ధమై.. ఆ వాచ్ మ్యాన్ కొంచెం ఆలస్యంగా వస్తే అంతే సంగతులని.. అందుకే ఆ వాచ్ మ్యాన్ సంగతేంటి.. అతడి దగ్గర తాళం ఉందా లేదా అని ముందు తెలుసుకుంటానన్నాడు.

పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్లు.. ఇంకా ఎంతో మంది కాల్ షీట్లు తీసుకుని అంతా సిద్ధం చేసుకోవడంలో చాలా కష్టం ఉంటుందని.. కాబట్టి ఏ చిన్న తేడా వచ్చినా షూటింగ్ ఆగిపోతుందని.. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఇలాంటి సందర్భాల్లో ఏమైనా ఇబ్బంది వస్తే తాను సహనం కోల్పోతానని శంకర్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English