రివ్యూయర్లకు విశాల్ విన్నపం

రివ్యూయర్లకు విశాల్ విన్నపం

ఈ రోజుల్లో సినిమాలకు సమీక్షలనేవి కీలకంగా మారాయి. తొలి షో పడ్డ గంటకల్లా సమీక్షలు వచ్చేస్తున్నాయి. జనాలు కూడా రివ్యూలు చూసుకుని కానీ సినిమాలకు వెళ్లట్లేదు. థియేటర్లలో ఖర్చులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో తమ డబ్బులు ఊరికే అలా పెట్టేయడానికి ఇష్టపడట్లేదు. ముఖ్యంగా టికెట్ల రేట్లు భారీగా ఉండే ఓవర్సీస్‌లో రివ్యూలు చూడకుండా జనాలు థియేటర్లకు వెళ్లడం తక్కువ. దీంతో రోజు రోజుకూ సమీక్షలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఐతే సినిమా బాగుందా లేదా తెలుసుకుని థియేటర్లకు వెళ్లడం ప్రేక్షకుల హక్కు. జనాల డిమాండ్‌ను బట్టి సమీక్షలు రాయడం మీడియా రైట్. ఐతే ఈ విషయం అర్థం చేసుకోకుండా కొందరు సినీ ప్రముఖులు రివ్యూయర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం చూశాం.

ఐతే కొందరు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తమిళ హీరో.. నిర్మాతల మండలి అధ్యక్షుడు కూడా అయిన విశాల్ రివ్యూల విషయంలో వెబ్ మీడియాకు ఒక విజ్ఞప్తి చేశాడు. సమీక్షలు సినిమా రిలీజైన వెంటనే ఇవ్వొద్దని.. తొలి మూడు రోజులు ఆగాలని అతను కోరాడు. దీని వల్ల నిర్మాత బతుకుతాడని.. ఓపెనింగ్స్ దెబ్బ తినకుండా ఉంటాయని అతనన్నాడు. ఐతే ప్రింట్ మీడియా మాత్రం రివ్యూలు కొనసాగించవచ్చని.. ఐతే వెబ్ మీడియా మాత్రం ఇమ్మీడియట్ రివ్యూలు ఇవ్వకుంటే మంచిదని.. దీన్ని విన్నపంగా భావించి ఆలోచించాలని విశాల్ కోరాడు. ఐతే ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదు. ఇంతకుముందు కూడా కొందరు ఇలాగే రిక్వెస్ట్ చేశారు. కానీ వెబ్ మీడియా ఆపినా.. సోషల్ మీడియా ఆగదు. ఈ రోజుల్లో సమాచార వ్యాప్తి చాలా విస్తృతం అయింది. వేగం పుంజుకుంది. ఒక వెబ్ సైట్ ఆగితే.. ఇంకో వెబ్ సైట్ మొదలై ఇమ్మీడియట్ రివ్యూలు ఇవ్వడం మొదలుపెడుతుంది. పదులు.. వందల్లో ఉన్న వెబ్ సైట్లను నియంత్రించడం అన్నది ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రతిపాదన వర్కవుట్ కావడం కష్టమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English