జయలలిత బయోపిక్.. పంచ్ పడింది

జయలలిత బయోపిక్.. పంచ్ పడింది

సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ బ్లాక్ బస్టర్ కావడంతో దక్షిణాదిన బయోపిక్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగులో ఎన్టీఆర్, వైఎస్‌ల కథలతో సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని కూడా వెండితెరకు ఎక్కించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఐతే అక్కడ జయలలిత మీద కేవలం ఒక్క సినిమా మాత్రమే రావట్లేదు. కాస్త అటు ఇటుగా మూడు నిర్మాణ సంస్థలు జయలలిత బయోపిక్స్ అనౌన్స్ చేశాయి. అందులో స్టార్ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్‌తో విష్ణు ఇందూరి తీయబోయే చిత్రం మీదే అందరి దృష్టీ నిలిచి ఉంది. విష్ణు ఇప్పటికే హిందీలో కపిల్ దేవ్ కథతో ‘83’.. తెలుగులో ‘యన్.టి.ఆర్’ తీస్తున్నాడు. బయోపిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విష్ణు.. జయలలిత సినిమాను అనౌన్స్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఐతే ఈ చిత్రం కోసం విష్ణు టీమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తుండగానే.. జయలలిత మీద ఒక సినిమాను మొదలుపెట్టేసింది మరో నిర్మాణ సంస్థ. ప్రియదర్శిని అనే లేడీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించనుంది. ‘ది ఐరెన్ లేడీ’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీని టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు మురుగదాస్ లాంచ్ చేశాడు.

విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ అనౌన్స్ చేశాక కూడా మురుగదాస్ లాంటి డైరెక్టర్‌.. వేరే జయలలిత బయోపిక్ టైటిల్ లోగోను లాంచ్ చేయించడంతో ఎవరికి వాళ్లు ఈ బయోపిక్ విషయంలో ఎంత ప్రతిష్టకు పోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా సైతం జయలలిత బయోపిక్ తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు.

ఆయన కూడా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే భారతీరాజా సైతం సినిమాను మొదలుపెట్టబోతున్నారు. మరి ఒకేసారి మూడు బయోపిక్స్ అంటే.. దేనిపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English