ఫ్లాప్ సినిమాకు సీక్వెల్

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్

దక్షిణాదిన సీక్వెల్స్ ఆడిన సందర్భాలు చాలా తక్కువ. సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీస్తేనే వర్కవుట్ కావడం లేదు. అలాంటిది ఇప్పుడు ఒక ఫ్లాప్ చిత్రానికి సీక్వెల్ తయారవుతోంది. రెండేళ్ల కిందట ప్రభుదేవా-తమన్నా జంటగా ‘అభినేత్రి’ అనే సినిమా వచ్చింది గుర్తుందా? ఈ చిత్రాన్ని మూడు భాషల్లో రూపొందించాడు దర్శకుడు ఎ.ఎల్.విజయ్. తెలుగులో ఈ తరహా హార్రర్ కామెడీ సినిమాలు బోలెడన్ని వచ్చాయి. దీంతో మన ప్రేక్షకులకు అది ఏమాత్రం రుచించలేదు. సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. హిందీలో కూడా ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. తమిళంలో మాత్రం ఓ మోస్తరుగా ఆడింది. ప్రభుదేవా, తమన్నా పెర్ఫామెన్స్ బాగుందని పేరొచ్చింది కానీ.. కథాకథనాల విషయంలో అందరూ పెదవి విరిచారు.

ఐతే ఒరిజినల్ అంతగా ఆడకున్నా ఇప్పడు దీనికి సీక్వెల్ తీస్తున్నాడు విజయ్. ప్రభుదేవా-తమన్నా కాంబినేషన్లోనే ఈ చిత్రం కూడా తెరకెక్కుతోంది. ప్రభుదేవా ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ అప్ డేట్ కూడా ఇచ్చాడు. దర్శకుడు విజయ్‌తో ప్రభుకి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్లిద్దరూ కలిసి ‘అభినేత్రి’ తర్వాత ‘లక్ష్మి’ అనే డ్యాన్స్ బేస్డ్ మూవీ ఒకటి చేశారు. అది గత నెలలోనే విడుదలైంది. ఆ సినిమా కూడా ఆడలేదు. విజయ్ పేరుకు టాప్ డైరెక్టరే కానీ.. అతడి కెరీర్లో మెజారిటీ సినిమాలు ఫ్లాపులే. ‘అభినేత్రి’కి.. ‘లక్ష్మి’కి మధ్యలో అతను తీసిన ‘కణం’ కూడా డిజాస్టరే. టేకింగ్ బాగుంటుందే తప్ప విజయ్ గొప్పగా ఏమీ సినిమాలు తీయడు. అయినా అతడికి అవకాశాలు మాత్రం ఆగవు. మరి ‘అభినేత్రి’ సీక్వెల్‌తో అతనెలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి. అతను తమిళంలో జయలలిత జీవిత కథతో తెరకెక్కే చిత్రానికి కూడా దర్శకత్వం వహించబోతుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English