అరవ అతిని తెలుగోళ్లు తట్టుకోగలరా?

అరవ అతిని తెలుగోళ్లు తట్టుకోగలరా?

తెలుగులో ఒకప్పుడు మాస్ మసాలా సినిమాలదే రాజ్యం. పెద్ద హీరోల సినిమాలన్నీ ఒక ఫార్మాట్లో సాగిపోయేవి. ప్రధానంగా మాస్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీసేవాళ్లు. కొత్తదనం గురించి పెద్దగా ఆలోచించకుండా ఒక మూసలో సినిమాలు లాగించేసేవాళ్లు. హీరోయిజం పీక్స్‌లో ఉండేది. యాక్షన్‌కు పెద్ద పీట వేసేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో మన సినిమాలు చాలా మారిపోయాయి. కొత్తదనం కథలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం.. ఫార్ములా సినిమాల్ని తిప్పి కొడుతుండటంతో ఫిలిం మేకర్స్ కూడా మారారు. హీరోల్లోనూ కథల ఎంపికలో మార్పు వచ్చింది. ఇమేజ్ గురించి.. హీరోయిజం గురించి పట్టించుకోకుండా విభిన్నమైన కథలతో సాగిపోతున్నారు హీరోలు కూడా. మధ్య మధ్యలో కొన్ని మాస్ సినిమాలు వస్తున్నాయి కానీ.. వాటికి సరైన ఆదరణ దక్కట్లేదు.

ఐతే ఒకప్పుడు తెలుగు సినిమాలు మూసలో సాగిపోతుంటే.. తమిళ చిత్రాలు కొత్తగా అనిపించేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. తమిళంలోనే మాస్ మసాలా సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. పాత స్టయిల్లో సినిమాలు తీస్తున్నారు. ఈ కోవలోనే ‘సామి స్క్వేర్’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్ర ప్రోమోలు చూస్తే ఇదొక సగటు పోలీస్ స్టోరీలా ఉంది. మాస్ హీరోయిజం హద్దులు దాటించేసినట్లున్నాడు హరి. అతను పోలీస్ సినిమాలు చాలానే తీశాడు ఇప్పటిదాకా. ముఖ్యంగా ‘సింగం’ సిరీస్‌లో ఒకటికి మూడు సినిమాలు రావడంతో జనాలకు మొహం మొత్తేసింది. ఇప్పుడు విక్రమ్‌తో తీసిన ‘సామి స్క్వేర్’ కూడా సింగం సిరీస్‌లో ఇంకో సినిమాలా ఉంది. దీని ట్రైలర్ చూస్తే వామ్మో ఏంటీ అతి అనుకున్నారు తెలుగు జనాలు. డైలాగులు, యాక్షన్, కామెడీ.. అన్నీ కూడా చాలా లౌడ్‌గా అనిపించాయి. అరవ అతి అడుగడుగునా కనిపించింది. తాజాగా రిలీజ్ ప్రోమో అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులోనూ ఇదే అతి కనిపించింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారి కొత్తదనానికి పట్టం కడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి అతిని భరించగలరా.. దీనికి ఆదరణ దక్కుతుందా అని సందేహాలు కలుగుతున్నాయి. ఈ శుక్రవారమే ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English