మణిరత్నం సినిమాకు అదే శాపం

మణిరత్నం సినిమాకు అదే శాపం

చాలా ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాక.. ఒక వయసు దాటాక దర్శకులు ఔట్ డేట్ అయిపోతుంటారు. వారిలో ఉత్సాహం తగ్గిపోతుంటుంది. ట్రెండుకు తగ్గ సినిమాలు చేయలేకపోతుంటారు. కానీ మణిరత్నం ఇందుకు మినహాయింపు. మణిరత్నం సినిమాల ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చు కానీ.. ఆయన  ఔట్ డేట్ కాలేదని మాత్రం సినిమాలు చూస్తే అర్థమవుతోంది.

ఒక యువ దర్శకుడి తరహాలో ‘ఓకే బంగారం’ సినిమాను లేటెస్ట్ ట్రెండుకు తగ్గట్లుగా తీర్చిదిద్దిన విధానం ఆయన ప్రత్యేకతను చాటిచెబుతుంది. ఐతే దీని తర్వాత ‘చెలియా’ను కూడా ట్రెండీగానే తీశాడు కానీ.. కొన్ని కారణాల వల్ల అది ప్రేక్షకులకు రుచించలేదు. ఇప్పుడాయన ‘చెక్క చివంత వానమ్’ అనే మల్టీస్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నెల 27నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులో ‘నవాబ్’ పేరుతో ఈ చిత్రం అనువాదమైంది.

ఎప్పట్లాగే రెండు భాషల్లోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. కానీ తెలుగు వెర్షన్‌కు ఆశించిన స్థాయిలో హైప్ కనిపించడం లేదు. ఇందుకు కారణం లీడ్ యాక్టర్లలో తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించేవాళ్లు లేరు. శింబు.. విజయ్ సేతుపతి.. అరవింద్ స్వామి.. అరుణ్ విజయ్ అందరూ అచ్చంగా తమిళులే. తెలుగులో వీరికి పెద్ద ఫాలోయింగ్ లేదు. మామూలుగా మణిరత్నం తన లీడ్ యాక్టర్లను ఎంచుకునేటపుడు తెలుగు మార్కెట్‌ను కూడా దృష్టిలో ఉంచుకుంటుంటాడు. కానీ ఈసారి దానిపై పెద్దగా దృష్టిపెట్టినట్లు లేడు.

శింబు తమిళంలో పెద్ద హీరోనే కానీ.. తెలుగులో అతడికి పెద్దగా పాపులారిటీ లేదు. విజయ్ సేతుపతి అసలే పరిచయం లేదు. ఉన్నంతలో అరవింద్ స్వామి బెటరే కానీ.. అతను ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆకర్షించలేడు. అరుణ్ విజయ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ‘నవాబ్’ ట్రైలర్ బాగున్నా.. వేరే ఆకర్షణలు చాలా ఉన్నా.. లీడ్ యాక్టర్లతో తెలుగు ప్రేక్షకులకు కనెక్షన్ తక్కువ కావడం మైనస్ అవుతోంది.

అందుకే ఈ చిత్రానికి తెలుగులో పెద్దగా బజ్ కనిపించడం లేదు. మణిరత్నం పేరు చూసే సినిమాకు వెళ్లాల్సి ఉంది. ఆయనకుండే అభిమానులు ఎప్పుడూ ఉంటారు. కానీ లీడ్ యాక్టర్ల ద్వారా ఉండాల్సిన ఆకర్షణ లేకపోయింది. మరి సినిమాకు మంచి టాక్ వచ్చి రిలీజ్ తర్వాత పరిస్థితి మారుతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English