లెజెండరీ కమెడియన్‌పై నిషేధం

లెజెండరీ కమెడియన్‌పై నిషేధం

తమిళ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప కమెడియన్లలో వడివేలు ఒకడు. దక్షిణాదిన ఒక దశలో మరే కమెడియన్‌కూ సాధ్యం కాని స్థాయిని అందుకున్నాడతను. కానీ మంచి స్థాయిలో ఉండగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి కెరీర్‌ను దెబ్బ తీసుకున్న వడివేలు.. మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తరచుగా ఆయన్ని ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది.

ప్రొడ్యూసర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకుని షూటింగ్ ఎగ్గొడతాడని.. సమయానికి షూటింగుకి రాడని.. మద్యం తాగి వచ్చి ఇబ్బంది పెడతాడని.. ఇలా చాలా ఆరోపణలే ఉన్నాయి ఆయన మీద. తాజాగా ఒక సినిమా విషయంలో వడివేలు శ్రుతి మించడంతో అతడిపై తమిళ ఫిలిం ఛాంబర్ నిషేధం విధించే వరకు పరిస్థితి వెళ్లింది.

అగ్ర దర్శకుడు శంకర్ నిర్మాణంలో ఆయన శిష్యుడు చింబుదేవన్ ఇంతకుముందు వడివేలు హీరోగా ‘హింసై అరసన్ 23వ పులకేసి’ అనే సినిమా తీశాడు. అది అప్పట్లో పెద్ద హిట్టయింది. దీనికి సీక్వెల్ తీయాలని శంకర్-చింబుదేవన్ అనుకున్నారు. వడివేలుతో సంప్రదించి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ప్రి ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. దీని కోసం చాలా ఖర్చు కూడా చేశారు. కానీ అంతా రెడీ చేసుకుని షూటింగ్ మొదలుపెడదామనుకునే సమయానికి వడివేలు హ్యాండ్ ఇచ్చాడు. తాను ఈ సినిమా చేయనన్నాడు. దీంతో శంకర్, చింబు దేవ‌న్‌లకు ఏం చేయాలో పాలుపోలేదు. మళ్లీ మళ్లీ అడిగి చూసినా ఫలితం లేకపోయింది. వడివేలు ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. దీంతో నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.

వడివేలు వల్ల తమకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఆ మొత్తం అతడి నుంచి ఇప్పించాలని కోరారు. ఈ విషయమై నోటీసులు జారీ చేసినా అతడి నుంచి స్పందన లేదు. దీంతో చివరికి వడివేలుకు రెడ్ కార్డు జారీ చేశారు. అతను ఏ సినిమాలోనూ నటించకుండా నిషేధం పడింది. వడివేలును ఏ సినిమాలోనూ పెట్టుకోకూడదని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ స్థితిలో వడివేలు ఏమైనా రాజీకొస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English