నాగ్-నానిలపై బాలీవుడ్ ముద్ర

  నాగ్-నానిలపై బాలీవుడ్ ముద్ర

ఏదైనా తెలుగు సినిమా హక్కుల్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ కొనుగోలు చేస్తే అమ్మో అనుకునే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్.. ఈరోస్ సంస్థలు ఒక సమయంలో తెలుగు సినిమాలపై బాగా ఆసక్తి చూపించాయి. హోల్‌ సేల్‌గా హక్కులు కొనేసి రిలీజ్ చేశాయి. కానీ ఆ సంస్థలు రిలీజ్ చేసిన సినిమాలన్నీ వరుసగా బోల్తా కొట్టేశాయి. ‘అత్తారింటికి దారేది’ మినహాయిస్తే రిలయన్స్ వాళ్లు రిలీజ్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే.

ఇక ఈరోస్ సంస్థ అయితే ‘1 నేనొక్కడినే’.. ‘ఆగడు’ లాంటి సినిమాల దెబ్బకు బెంబేలెత్తిపోయింది. దీంతో ఈ సంస్థలు తెలుగు సినిమాల్ని కొనడమే మానేశాయి. కొన్నేళ్ల విరామం తర్వాత ఇటీవలే ఈరోస్ సంస్థ మళ్లీ ‘సాక్ష్యం’ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీకి ఇచ్చింది. దాని ఫలితమేంటో తెలిసిందే.

ఈ ఎదురు దెబ్బ తర్వాత కూడా మరో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ ఓ తెలుగు సినిమాను హోల్‌సేల్‌గా కొనేయడం విశేషం. ఆ చిత్రం నాగార్జున-నానిల ‘దేవదాస్’ కాగా.. దాన్ని కొన్న సంస్థ వయాకామ్ 18. హిందీలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన ఈ సంస్థ ఫ్యాన్సీ రేటు ఇచ్చి ‘దేవదాస్’ వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ తీసుకుందట. ‘దేవదాస్’ తాజా ప్రోమోల్లో ‘వయాకామ్ 18’ లోగో కూడా కనిపించింది.

ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా ఫస్ట్ కాపీ కూడా రాలేదు. మరి ఈ లోపే సినిమాపై ఎలా నమ్మకం కుదిరిందో మరి. దీని ప్రోమోలైతే భలేగా ఉన్న మాట వాస్తవం. అవే ‘వయాకామ్ 18’ వాళ్లను ఆకర్షించినట్లున్నాయి. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న ‘దేవదాస్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు