మన్మథుడు-2పై క్లారిటీ ఇచ్చిన అబ్బాయి

మన్మథుడు-2పై క్లారిటీ ఇచ్చిన అబ్బాయి

అక్కినేని నాగార్జున కెరీర్లో ప్రత్యేకమైన సినిమా ‘మన్మథుడు’. నాగార్జున గ్లామర్‌ను సరిగ్గా వాడుకుని విజయ భాస్కర్-త్రివిక్రమ్ జోడీ మ్యాజిక్ చేసింది. ఈ సినిమా తర్వాత నాగార్జున పేరు ముందు ‘మన్మథుడు’ అనే పదం స్థిరపడిపోయింది. ఐతే ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది.. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సీక్వెల్ అంటూ ప్రచారం జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ‘మన్మథుడు-2’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించినట్లు వార్తలొచ్చాయి. ఐతే విజయ భాస్కర్ సినిమాలు మానేశాడు. త్రివిక్రమ్ దర్శకుడిగా బిజీగా ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో నాగార్జునతో ‘మన్మథుడు-2’ తీసేదెవరు.. ఇంతకీ ఈ చిత్రం చేసేది నాగార్జునా లేక ఆయన కొడుకుల్లో ఒకరా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఐతే నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్య ఈ సినిమా విషయంలో స్పష్టత ఇచ్చాడు.

‘మన్మథుడు’ తరహాలో తమ సంస్థలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్న మాట వాస్తవమే అని చెప్పాడు. ఐతే ఇది ‘మన్మథుడు’ స్టయిల్లో ఉంటుంది కానీ దానికి సీక్వెల్ కాదని చెప్పాడు. టైటిల్ మాత్రం ‘మన్మథుడు-2’గానే ఉంటుందన్నాడు. ఈ చిత్రాన్ని ‘చి ల సౌ’తో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తాడని చైతూ వెల్లడించాడు. ‘చి ల సౌ’ చూసిన వెంటనే నాగ్.. రాహుల్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడని.. రాహుల్ కూడా ఈ కమిట్మెంట్‌ను సీరియస్‌గా తీసుకుని స్క్రిప్టు తీర్చిదిద్దుతున్నాడని చైతూ తెలిపాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నాడు. మరోవైపు తనతో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా తీసిన మారుతి దర్శకత్వంలో తన తమ్ముడు అఖిల్ హీరోగా ఒక సినిమా తెరకెక్కే అవకాశాలున్నట్లు చైతూ వెల్లడించాడు. ‘శైలజారెడ్డి అల్లుడు’ సెట్స్‌లో మారుతి-అఖిల్ కలిశారని.. వాళ్ల మధ్య కథా చర్చలు జరిగాయని.. త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయొచ్చని చైతూ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English