ఒక సినిమా అందరి ఆశల్ని తుంచేసింది

ఒక సినిమా అందరి ఆశల్ని తుంచేసింది

మను.. ఈ సినిమా చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ చిన్న సినిమా వాళ్లందరి ఆశల్ని తుంచేసింది. దర్శకుడు కావాలని కలలు కని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు సంపాదించి.. సోషల్ మీడియాలో జనాల మద్దతు సంపాదించి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ‘మను’ చిత్రాన్ని రూపొందించాడు ఫణీంద్ర నరిశెట్టి. ఈ సినిమా విజయవంతమైతే ఇక క్రౌడ్ ఫండింగ్ మీద ఆధారపడాల్సిన పని లేకుండా నిర్మాతల నుంచి ఆఫర్ అందుకునేవాడు. కానీ ఈ సినిమా తేడా కొట్టడంతో అటు నిర్మాతల నుంచి పిలుపు వచ్చే పరిస్థితి లేదు. ఇంకోసారి సోషల్ మీడియా జనాలు అతడిని నమ్ముతారా అన్నది సందేహమే.


దర్శకుడి సంగతలా వదిలేస్తే.. ‘మను’ హీరో హీరోయిన్లు దీనిపై చాలా ఆశలతోనే ఉన్నారు. వాళ్లిద్దరికీ ఈ సినిమా సక్సెస్ కావడం చాలా చాలా అవసరం. బ్రహ్మానందం నట వారసత్వాన్నందుకుని సినిమాల్లోకి అడుగుపెట్టిన రాజా గౌతమ్‌కు అసలిక్కడ ఏమాత్రం కలిసి రాలేదు. తొలి సినిమా ‘పల్లకిలో పెళ్లికూతురు’ నుంచి.. చివరగా చేసిన ‘బసంతి’ వరకు అన్నీ నిరాశ పరిచాయి. దీంతో ఈసారి చాలా గ్యాప్ తీసుకుని ‘మను’ లాంటి వైవిధ్యమైన చిత్రం చేశాడు. ఇది కచ్చితంగా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని ఆశించాడు. ఇంకోవైపు అందం, అభినయం రెండూ ఉన్న తెలుగమ్మాయి చాందిని చౌదరి కూడా ‘మను’తో తన దశ తిరుగుతుందని ఆశించింది. ఇప్పటిదాకా చాందిని చేసిన సినిమాలన్నీ ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఐతే ఫణీంద్ర తీసిన షార్ట్ ఫిలిం ‘మధురం’తో తనకు చాలా మంచి పేరు వచ్చిన నేపథ్యంలో అతను తీస్తున్న తొలి సినిమా కూడా తనకు ఇండస్ట్రీలో బ్రేక్ ఇస్తుందని ఆశించింది చాందిని. కానీ ఆమె ఆశ తీరలేదు. వీరితో పాటు ఇంకా ఈ చిత్రంపై నమ్మకం పెట్టుకున్న ఇంకొందరు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఆశల్ని కూడా ‘మను’ తుంచేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు