చైతూకు నచ్చని ఆ రెండు సినిమాలు

చైతూకు నచ్చని ఆ రెండు సినిమాలు

అక్కినేని నాగచైతన్య కెరీర్ కాస్త గాడిన పడడానికి చాలా సమయమే పట్టింది. కెరీర్ మొదట్లో అతడిని ఎక్కువగా ఫ్లాపులే పలకరించాయి. ముఖ్యంగా యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవడం కోసం అతను చేసిన ప్రయత్నాలు దారుణమైన ఫలితాన్నిచ్చాయి. దడ.. బెజవాడ లాంటి సినిమాలు అతడికి చేదు జ్ఞాపకాల్ని మిగిల్చాయి. ఈ రెండు సినిమాలు చేసినందుకు ఇప్పుడు ఫీలవుతున్నాడు చైతూ. తన కెరీర్లో ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో తనకు నచ్చని సినిమాలు ఇవి రెండే అని చెప్పాడు. తాను ఆ సినిమాలు చేయాల్సింది కాదని చెప్పాడు చైతూ. ఐతే యాక్షన్ సినిమాలతో విజయాలు అందుకోలేదన్న అసంతృప్తి తనలో ఉందని.. కాబట్టి అలాంటి సినిమాలు పూర్తిగా విడిచిపెట్టేది మాత్రం లేదని చైతూ చెప్పాడు. ఇక తొమ్మిదేళ్ల కెరీర్లో తనకు మరపురాని చిత్రం అంటే ‘ప్రేమమ్’ అని.. అది తనలోని విభిన్న కోణాల్ని చూపించిందని చైతూ చెప్పాడు.

తన తండ్రి నాగార్జున లాగే కెరీర్ మొదట్లో తాను కూడా కొత్త డైరెక్టర్లను బాగా ప్రోత్సహించానని.. కానీ వాళ్లతో తనకు వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు కొంచెం అనుభవం ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తున్నానని.. ఇంకొంత కాలం ఇలాగే కంటిన్యూ అయిపోతానని చైతూ అన్నాడు. ‘అర్జున్ రెడ్డి’.. ‘ఆర్ఎక్స్ 100’ లాంటి ఇంటెన్స్ సినిమాలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారని.. కానీ తాను ఇప్పుడే అలాంటి క్యారెక్టర్లు చేయలేదని.. ఇంకొంచెం సమయం పడుతుందని చైతూ చెప్పాడు. తన కొత్త సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని.. ఈ సినిమాతో తాను కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువ అవుతానని చైతూ ధీమా వ్యక్తం చేశాడు. ఈ చిత్ర కథ అందరూ అనుకుంటున్నట్లు అత్తా అల్లుళ్ల రివెంజ్ డ్రామా కాదని.. ఇగో అనేది ఎలాంటి సమస్యలు తెచ్చి పెడుతుందో ఇందులో వినోదాత్మకంగా చెప్పామని.. కొంత సందేశం కూడా ఇచ్చామని చైతూ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు