సంక్రాంతి రేసు నుంచి ‘యాత్ర’ ఔట్

సంక్రాంతి రేసు నుంచి ‘యాత్ర’ ఔట్

తెలుగులో ఇప్పుడు బయోపిక్స్‌కు మంచి ఊపు కనిపిస్తోంది. ‘మహానటి’ భారీ విజయం సాధించడంతో మరిన్ని బయోపిక్స్ తెరమీదికి వచ్చాయి. అందులో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే పండక్కి ఎన్టీఆర్ బయోపిక్ కూడా రాబోతుండటంతో ఎన్టీఆర్ వెర్సస్ వైఎస్ పోరు ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. ఐతే ఈ క్లాష్ ఉండబోదన్నది తాజా సమాచారం. అనుకున్న దాని కంటే ముందే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారట. డిసెంబరు 21న వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు కానుకగా ‘యాత్ర’ను రిలీజ్ చేస్తారట.
వాస్తవానికి ‘యన్.టి.ఆర్’తో పోలిస్తే ‘యాత్ర’ మీద ప్రేక్షకుల్లో అంత ఆసక్తి ఉంటుందా అన్నది సందేహమే.

ఎన్టీఆర్‌ ఆకర్షణ వేరు. ఆయన జీవితంలోని డ్రామా వేరు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ శిఖర స్థాయిని చూశారాయన. అలాగే రాజకీయాల్లో ఆయన పతనం.. మరణానికి దారి తీసిన పరిస్థితుల్లోనూ ఎంతో డ్రామా ఉంది. వైఎస్ కథ అలా కాదు. ఇందులో డ్రామా తక్కువే. ఎన్టీఆర్ అందరివాడు. ఆయన్ని వ్యతిరేకించే వాళ్లు లేరు. కానీ వైఎస్‌‌కు వ్యతిరేకులు కూడా ఉన్నారు. సామాన్య జనాల్లో ఎన్టీఆర్ సినిమా మీద ఉన్నంత ఆసక్తి వైఎస్ చిత్రం మీద ఉంటుందా అన్నది సందేహమే. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఎన్టీఆర్ సినిమాతో వైఎస్ చిత్రం పోటీ పడటం అన్నది సరైన ఆలోచన కాదు. పైగా ఆ పండక్కి రామ్ చరణ్-బోయపాటి చిత్రంతో పాటు ‘ఎఫ్-2’ కూడా విడుదల కాబోతున్నాయి. ఇంత పోటీ మధ్య ‘యాత్ర’ను రిలీజ్ చేస్తే కష్టమవుతుంది. అందుకే సంక్రాంతి రేసు నుంచి దీన్ని తప్పించినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు