తారక్ సినిమాల్లో చైతూ ఫేవరెట్?

తారక్ సినిమాల్లో చైతూ ఫేవరెట్?

తెలుగులో చాలా రిజర్వ్డ్‌గా ఉండే హీరోల్లో అక్కినేని నాగచైతన్య ఒకడు. అతను సినిమాల గురించి మాట్లాడటమే తక్కువ. ఇక వ్యక్తిగత విషయాల గురించి అసలే మాట్లాడడు. మిగతా హీరోల్లా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేయడం కూడా అరుదే. ఐతే తన భార్య సమంత ప్రభావమో ఏమో.. ఈ మధ్య అతడిలో కొంచెం మార్పు కనిపిస్తోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో అతను యాక్టివ్‌గా ఉంటున్నాడు. తాజాగా అతను తన కొత్త సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రమోషన్లలో భాగంగా అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. ఈ సందర్భంగా అతడికి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు తగ్గట్లే సమాధానాలు కూడా ఇచ్చాడు చైతూ.

ఒక నెటిజన్.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో మీకేది ఇష్టం.. అతడి గురించి మీ అభిప్రాయమేంటి అని అడిగాడు. దీనికి సమాధానమిస్తూ.. ‘యమదొంగ’ ఎన్టీఆర్ సినిమాల్లో తన ఫేవరెట్ అని చెప్పాడు. ఎన్టీఆర్ ప్రతి సినిమా తాను చూస్తానని.. అతను స్ఫూర్తినిచ్చే వ్యక్తి అని.. నటుడిగా తారక్ అద్భుతమైన పాత్రలు ఎంచుకుంటున్నాడని.. అతనో ఆల్ రౌండర్ అని అన్నాడు చైతూ. తన తండ్రి సినిమాల్లో ‘హలో బ్రదర్’ ఫేవరెట్ అన్న చైతూ.. ప్రభాస్ సినిమాల్లో ‘బాహుబలి’.. వెంకటేష్ చిత్రాల్లో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’.. మహేష్ హీరోగా నటించిన వాటిలో ‘పోకిరి’ తన ఫేవరెట్ అని అన్నాడు. సమంత గురించి ఒక్క మాటలో చెప్పమంటే.. ఆమె తన జీవితంలో సూపర్ స్టార్ అని చెప్పాడు చైతూ. ఆమె వ్యక్తిత్వం నచ్చే ప్రేమించానని.. పెళ్లి కూడా చేసుకున్నానని అన్నాడు చైతూ. తన కొత్త సినిమా ‘సవ్యసాచి’ గురించి చెప్పమంటే.. అది చాలా కొత్తగా ఉంటుందని.. అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ మిస్ కావని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు