కామెడీ హీరోలకు మళ్లీ పంచ్

కామెడీ హీరోలకు మళ్లీ పంచ్

కామెడీ హీరోలుగా ఒకప్పుడు అల్లరి నరేష్, సునీల్‌లకు మంచి గుర్తింపుండేది. మంచి విజయాలూ దక్కేవి. అల్లరోడికి అప్పుడప్పుడూ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా మళ్లీ పుంజుకుని సక్సెస్ సాధించేవాడు. అతడికంటూ ఒక మార్కెట్ ఉండేది. ఇక కమెడియన్‌గా మంచి రేంజ్ అందుకున్న సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి వరుస విజయాలందుకున్నాడు.

అతడి కెరీర్ కూడా బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఈ ఇద్దరూ హీరోలకూ నాలుగైదేళ్లుగా అస్సలు కలిసి రావడం లేదు. ఒకరిని మించి ఒకరు ఫ్లాపులు తిన్నారు. పూర్తిగా మార్కెట్ కోల్పోయారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ‘సిల్లీ ఫెలోస్’ అంటూ ఒక సినిమా చేశారు. ఈ చిత్రం గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తుంది. తమిళంలో విజయవంతమైన ఓ చిత్రం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రమైనా ఈ కామెడీ హీరోలకు ఉపశమనాన్నిస్తుందేమో అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.

తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ రాలేదు. హీరోలిద్దరి మార్కెట్ దెబ్బ తినేయడంతో ఆ ప్రభావం ఓపెనింగ్స్‌పై పడింది. టాక్ కూడా బాగా లేకపోవడంతో సినిమా పుంజుకోలేదు. ఔట్ డేటెడ్ కామెడీ ఈ చిత్రానికి పెద్ద మైనస్ అయింది. ఇలాంటి లౌడ్ కామెడీ ఈ తరం ప్రేక్షకులకు అస్సలు రుచించడం లేదు. మాస్ ప్రేక్షకులకు సైతం ఈ కామెడీ ఎక్కలేదు. దీంతో ‘సిల్లీ ఫెలోస్’ అల్లరి నరేష్, సునీల్‌ల ఖాతాలో మరో ఫ్లాప్‌ను జమ చేసింది. నిజానికి ఈ చిత్రంలో సునీల్ హీరో కాదు. హీరో స్థాయికి దగ్గరగా ఉండే కమెడియన్ పాత్ర అతడిది.

ఇక హీరో వేషాలు మానేసి కమెడియన్‌గా సెటిలైపోవాలనుకుంటున్న సునీల్‌కు.. ఇటు పూర్తి హీరో కాకుండా.. అటు పూర్తి కమెడియన్ కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండే పాత్ర చేశాడు. కానీ అతడికి నిరాశ తప్పలేదు. మరి కమెడియన్‌గా రెండో ఇన్నింగ్స్‌లో అతనెలా రాణిస్తాడో చూడాలి. ఇక అల్లరోడు సైతం హీరో క్యారెక్టర్లకు సెలవిచ్చేసి సహాయ పాత్రల్లోకి మళ్లుతున్నాడు. మహేష్ బాబు సినిమాలో అతను క్యారెక్టర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English