గీత గోవిందం.. ఇప్పుడెక్కడుంది?

గీత గోవిందం.. ఇప్పుడెక్కడుంది?

బడ్జెట్ పరంగా చూస్తే ‘గీత గోవిందం’ చిన్న సినిమానే. కానీ వసూళ్ల కోణంలో చూస్తే మాత్రం ఇది చాలా పెద్ద సినిమా. విడుదలకు ముందు ఈ చిత్రానికి ఎంత హైప్ ఉన్నా.. రిలీజ్ రోజు ఎంత మంచి టాక్ వచ్చినా.. మరీ ఈ స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందని ఎవరూ అనుకోలేదు. రూ.50 కోట్ల షేర్ మార్కును అందుకోవడమే అద్భుతం అనుకుంటే.. ఆ  తర్వాత కూడా జోరు కొనసాగించి మూడు, నాలుగు వారాల్లోనూ మంచి షేర్ సాధించింది. ఇప్పటిదాకా ఈ చిత్రం రూ.67 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఐదో వారాంతంలో కూడా ఈ చిత్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే షేర్ వచ్చింది. ‘గీత గోవిందం’ వచ్చాక తర్వాతి నాలుగు వారాల్లో దాని వసూళ్లపై ప్రభావం చూపించే చిత్రమే రాలేదు. వినాయక చవితికి ‘శైలజారెడ్డి అల్లుడు’ వస్తే కానీ ‘గీత గోవిందం’ జోరుకు బ్రేక్ పడేలా లేదు.

మొత్తానికి ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.70 కోట్ల షేర్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 10 కోట్లకు అటు ఇటుగా బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్లకు మాత్రమే ఈ ఘనత సాధ్యమైంది. ‘గీత గోవిందం’ విడుదలకు ముందు ఈ సినిమా ఏ రేంజికి వెళ్తుందో చూస్తారు అంటూ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్షర సత్యమయ్యాయి. ఈ విజయంలో హీరో విజయ్ దేవరకొండకు మేజర్ క్రెడిట్ ఇవ్వాలనడంలో సందేహం లేదు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత యువతలో విపరీతమై క్రేజ్ సంపాదించుకున్న విజయ్.. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా సాగే ‘గీత గోవిందం’లోనూ భిన్నమైన నటనతో గోవింద్ పాత్రను పండించాడు. మరి ‘గీత గోవిందం’ ఊపును అతను తర్వాతి సినిమాలో కొనసాగిస్తాడా లేదా అన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English