రచ్చ లేపుతోన్న ట్రెయిలర్‌

రచ్చ లేపుతోన్న ట్రెయిలర్‌

క్రేజీ కాన్సెప్టులకి పెట్టింది పేరయిన బాలీవుడ్‌ నుంచి త్వరలో రాబోతున్న ఒక సినిమా కాన్సెప్ట్‌కి అంతా పిచ్చెత్తిపోతున్నారు. పెళ్లీడుకి వచ్చిన కొడుకు వున్న తల్లిదండ్రులు మళ్లీ ప్రెగ్నెంట్‌ అయితే అప్పుడు ఆ కొడుకు పరిస్థితి ఏంటి, అతని పెళ్లికి అది ఆటంకంగా మారితే ఏమవుతుంది అనే చిత్రమైన పాయింట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం పేరు 'బదాయి హో'. కథా బలమున్న చిత్రాలు చేస్తాడనే పేరున్న ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించిన ఈ చిత్రానికి అమిత్‌ శర్మ దర్శకుడు.

దంగల్‌లో అమీర్‌ కూతుళ్లలో ఒకరిగా నటించిన సాన్యా మల్హోత్రా కథానాయికగా నటించింది. ఒక్క రోజులోనే ఈ ట్రెయిలర్‌కి నలభై లక్షలకి పైగా వ్యూస్‌ వచ్చాయి. ఎవరి నోట విన్నా ఇదే టాపిక్‌ అనే రీతిన ఈ ట్రెయిలర్‌ సూపర్‌హిట్‌ అయింది. వల్గారిటీ లేకుండా క్లీన్‌ ఫన్‌తో చిత్రీకరించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. అక్టోబర్‌ 19న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఇప్పుడు ఫుల్‌ క్రేజ్‌ వచ్చేసింది.

ఒక సినిమా ట్రెయిలర్‌ ఇంతగా హిట్‌ అయిందంటే ఇక దానికి వచ్చే ఓపెనింగ్స్‌ ఎలా వుంటాయనేది చెప్పనక్కర్లేదు. ట్రెయిలర్‌ సక్సెస్‌ చూస్తోంటే ఆయుష్మాన్‌కి దీంతో వంద కోట్ల సక్సెస్‌ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది యూనివర్సల్‌ పాయింట్‌ కనుక తెలుగులో కూడా రీమేక్‌ చేసే అవకాశాలు కూడా బాగా వున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు