కేసీఆర్ సెంచరీకి ఆంధ్ర ఓటర్లే అడ్డంకా?

కేసీఆర్ సెంచరీకి ఆంధ్ర ఓటర్లే అడ్డంకా?

ఆంధ్రా సెటిలర్లు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలను ఇప్పటికే పార్టీలోకి తీసుకొచ్చేశాం.. మొన్న నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడంతో పాటు కేటీఆర్ అంతా తానే అయి దగ్గరుండి కార్యక్రమాలు జరిపించారు... మరి, ఇన్ని చేశాక హైదరాబాద్‌లోని ఆంధ్రా సెటిలర్లు మాకెందుకు ఓటేయరు అన్నది టీఆరెస్ ఆలోచనగా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. హైదరాబాద్‌లో ఈసారి సీట్లు పెరుగుతాయన్ననమ్మకంతోనే టీఆరెస్ 100 స్థానాల టార్గెట్ పెట్టుకుందని చెబుతున్నారు.

నిజానికి గత ఎన్నికల సమయంలో ఆంధ్ర ఓటర్లు టీఆరెస్ పట్ల విముఖత చూపించారు. కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికలకొచ్చేసరికి పరిస్థితులు మారాయి. ఆంధ్ర ఓటర్లు అనుకూలంగా ఓటేయడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలతో టీఆరెస్ హైదరాబాద్‌లో తోపుగా మారింది. కానీ, ఇప్పుడు ఆంధ్ర ఓటర్లు టీఆరెస్‌కు అంతగా సహకరించే పరిస్థితులు లేవన్న మాట వినిపిస్తోంది. దీనికి రాజకీయ కారణాలే ప్రధానకంగా కనిపిస్తున్నాయి.

ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా మోసగించిన బీజేపీతో కేసీఆర్ భుజంభుజం రాసుకుంటూ రాజకీయాలు చేస్తుండడం ఆంధ్ర సెటిలర్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. మరోవైపు ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో ఎన్నికల హడావుడి పూర్తిచేసుకుని ఏపీ ఎన్నికలకు వచ్చేసరికి ఏపీలో ఏదైనా ముసలం పుట్టించేందుకు, ఓటుకు నోటు కేసు వంటివి బయటకు తీసి చంద్రబాబును ఇబ్బందిపెట్టడానికి కేసీఆర్ బీజేపీతో కలిసి వ్యూహం పన్నుతున్నారన్న ప్రచారం ఒకటి పెద్దఎత్తున సాగుతోంది. ఇది కూడా టీఆరెస్ పట్ల హైదరాబాద్ ఆంధ్రావాలాల్లో అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో వారు ఈ ఎన్నికల్లో టీఆరెస్‌కు ఎంతవరకు సహకరిస్తారన్నది అనుమానమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు