ఆ గట్టునుందామా.. లేక ఈ గట్టుకొద్దామా?

ఆ గట్టునుందామా.. లేక ఈ గట్టుకొద్దామా?

కేసీఆర్ ముందస్తు ఎన్నికలు హైదరాబాదీ మాస్ లీడర్ దానం నాగేందర్‌ను ఇరకాటంలో పడేశాయి. ఎన్నో శషభిషల తరువాత కొద్దికాలం కిందటే టీఆరెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి దానం నాగేందర్‌కు కేసీఆర్ ‘లిస్ట్ 105’లో ప్లేస్‌ దొరకలేదు. దీంతో ఆయన్ను మళ్లీ సొంత గూటికి తెచ్చేందుకు కాంగ్రెస్ మిత్రులు చురుగ్గా కదులుతున్నారు. ఈ క్రమంలోనే పీసీపీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌తో దానం భేటీ అయ్యారని ప్రచారం జరుగుతున్నా దాన్ని దానం ఖండిస్తున్నారు.

దానం ఖైరతాబాద్ లో పోటీ చేయాలన్న కోరికతో ఉన్నారు. కానీ, కేసీఆర్ కనికరించలేదు. లిస్టులో పేరు లేకపోవడమే కాకుండా కనీసం కేసీఆర్ నుంచి హామీ కూడా దొరకలేదు. దీంతో నాగేందర్ 2019 ఎన్నికల కోసం తన ప్లాను తాను గీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో రహస్యంగా ఒక హోటల్ లో సమావేశమైనారన్న ప్రచారం ఒకటి సోమవారం వినిపించింది. దీనిపై దానం నాగేందర్ స్పందించారు. జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్తానన్నది నిజం లేదన్నారు.  కేసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమే అని అంటున్నారు.

నిజానికి దానం నాగేందర్ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దానం నాగేందర్ పార్టీ మారతారంటూ ఒకసారి పెద్ద ఎత్తున ఉదయం ఖైరతాబాద్ పరిసరాల్లో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అంతలోనే ఆ ఫ్లెక్సీలన్నీ మాయం చేశారు. ఆ సమయంలో కేసిఆర్ సమక్షంలో అయితేనే టిఆర్ఎస్ లో చేరతానని దానం నాగేందర్ కండీషన్ పెట్టారట. కానీ ఆ సమయంలో కేసిఆర్ సమక్షంలో కాకుండా మంత్రుల సమక్షంలో జాయిన్ కావాలని టిఆర్ఎస్ సూచించింది. దీంతో దానం వెనుకంజ వేశారు. కానీ, కొన్ని నెలల కిందట ఆయన చేరిపోయారు. ఆయన ఖైరతాబాద్ సీటు ఆశిస్తుంటే టీఆరెస్ మాత్రం ఆయన్ను గోషా మహల్ నుంచి బరిలో దిగమని సూచిస్తోంది. లేదంటే సికింద్రాబాద్, లేదా మల్కాజ్ గిరి పార్లమెంటు సీట్ల నుంచి పోటీ చేయాలని సూచిస్తోంది. ఈ మూడు కూడా రాంగ్ ఆప్షన్లేనన్నది దానం ఆలోచనగా చెబుతున్నారు. గోషామహల్‌లో రాజాసింగ్‌పై గెలవడం అంత సులభం కాదని.. అలాగే సికింద్రాబాద్, మల్కాజ్ గిరి స్థానాలకు పోటీ అంటే జేబు ఖాళీ చేసుకోవడమేనని ఆయన తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. దీంతో అలాంటి రిస్క్ చేసే కంటే పాత పార్టీలోకి వెళ్లడమే బెటరని ఆయన అనుకుంటున్నారట. అందులో భాగంగానే తాజాగా తన అనుచరులతోనూ సమావేశామయ్యారని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు