‘బ్రాండ్ బాబు’ దెబ్బకు బెంబేలెత్తాడా?

‘బ్రాండ్ బాబు’ దెబ్బకు బెంబేలెత్తాడా?

దర్శకుడిగా కొంచెం పేరు రాగానే నిర్మాత అవతారం ఎత్తేశాడు మారుతి. అతడి నుంచి గతంలో చాలా సినిమాలే వచ్చాయి. ఐతే మొదట్లో మారుతి హ్యాండ్ పడ్డ సినిమాలు పర్వాలేదన్నట్లే ఉండేవి. కానీ తర్వాత తేడా వచ్చేసింది. మారుతి సినిమా అంటే బి-గ్రేడ్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. దర్శకుడిగా మారుతి మొదట్లో తీసిన ‘ఈ రోజుల్లో’.. ‘బస్ స్టాప్’ సినిమాల తరహాలో డబుల్ మీనింగ్ డైలాగులు.. రొమాన్స్ తప్ప ఏమీ లేని పరిస్థితి వచ్చింది.

దీంతో కొన్నాళ్లు రచనకు.. నిర్మాణానికి దూరంగా ఉన్నాడు మారుతి. ఐతే కొంచెం విరామం తీసుకుని రెండేళ్ల కిందట ‘రోజులు మారాయి’ అనే సినిమాను అందించాడు మారుతి. దానికి రచన, నిర్మాణ బాధ్యతలు మారుతివే. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. మళ్లీ గ్యాప్ తీసుకుని ‘బ్రాండ్ బాబు’ సినిమాతో పలకరించాడు మారుతి. గత నెలలో రిలీజైన ఈ చిత్రమూ అదే ఫలితాన్నందుకుంది.

‘బ్రాండ్ బాబు’కు మరీ దారుణమైన ఫలితం రావడంతో మారుతి పునరాలోచనలో పడ్డట్లుంది. ఇక నుంచి తాను చిన్న సినిమాను నిర్మించనంటూ అతను స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. తన కథల్ని వేరే దర్శకులు సరిగా తీయట్లేదనన్న అభిప్రాయం అతడి మాటల్లో వ్యక్తమైంది.

‘‘నేను ఒక స్క్రిప్టు బాగా రాసుకుని ఒక దర్శకుడికి ఇస్తే అతను ఆ స్క్రిప్టుని బాగా తెరకెక్కించడం ఒక రకం. అలా కాకుండా అతడి శైలిలో తీయడం ఒక రకం. ఈ క్రమంలో వాళ్లు బాగా తీయొచ్చు. తీయలేకపోవచ్చు. ఒక కథను వేరే దర్శకుడు తీస్తున్నపుడు మనం కొంత వరకే ఇన్వాల్వ్ కాగలం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని చిన్న సినిమాలు నిర్మించడం ఆపేశాను. ఒకవేళ సినిమా చేయాల్సి వస్తే నా టీంకు పూర్తి నమ్మకం కుదిరాకే ముందడుగు వేస్తాను’’ అని మారుతి చెప్పాడు.

అతడి మాటల్ని బట్టి చూస్తే తన కథల్ని వేరే దర్శకులు తాను ఆశించిన స్థాయిలో తీయట్లేదన్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాన్సెప్ట్ పరంగా బాగానే అనిపించే ‘బ్రాండ్ బాబు’ను ప్రభాకర్ పేలవంగా తీశాడన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో మారుతి ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు