అల్లుడి గారికి లైన్ క్లియర్

అల్లుడి గారికి లైన్ క్లియర్

గత నెల మధ్యలో వచ్చిన ‘గీత గోవిందం’ తర్వాత సరైన సినిమా పడలేదు తెలుగులో. తర్వాతి వారాల్లో వచ్చిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టేశాయి. దీంతో ‘గీత గోవిందం’ చిత్రం జోరు కొనసాగింది. గత నాలుగు వారాల్లో చెప్పుకోదగ్గ సినిమా అంటే ‘కేరాఫ్ కంచరపాలెం’ మాత్రమే. ఈ సినిమాకు చాలా మంచి టాక్ వచ్చింది కానీ.. అందుకు తగ్గట్లు వసూళ్లు లేని మాటా వాస్తవమే. ఇది ఓ వర్గం ప్రేక్షకుల్నే ఆకట్టుకుంటోంది. మాస్ జనాల్లోకి ఇది వెళ్లలేదు. దీంతో వసూళ్లు ఓ మోస్తరుగానే ఉన్నాయి.

 మొత్తంగా నాలుగు వారాల పాటు థియేటర్లను కళకళలాడించే సినిమా ఏదీ లేకపోయింది. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోద యోగ్యమైన సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో థియేటర్లలోకి దిగుతోంది ‘శైలజారెడ్డి అల్లుడు’.

వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా ఉండటంతో ప్రేక్షకులకు దీనిపై బాగానే ఆసక్తి నెలకొంది. పండగ సీజన్లో రావడం దీనికి బాగా కలిసి రానుంది. గురువారమే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ ఉంటుంది. దీనికి పోటీగా వస్తున్న ‘యు టర్న్’ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడేవాళ్లను మాత్రమే ఆకర్షిస్తుంది.

దాని వల్ల ‘శైలజా రెడ్డి అల్లుడు’పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఆగస్టు 31నే రావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో వాయిదా పడి ఇప్పుడు రిలీజవుతోంది. వాయిదా వల్ల దీనికి మంచే జరిగింది. 31న రిలీజయ్యుంటే ‘గీత గోవిందం’ ధాటిని తట్టుకోవడం కొంచెం కష్టమే అయ్యేది. ఇప్పుడు ఆ చిత్రం జోరు తగ్గిపోయాక పండగ సీజన్లో వస్తుండటం దీనికి అడ్వాంటేజీనే. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే నాగచైతన్య కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్టయ్యే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English