నేను చేస్తే కంచరపాలెం చెడిపోయేది

నేను చేస్తే కంచరపాలెం చెడిపోయేది

అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన ‘కేరాఫ్ కంచరపాలెం’ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతోంది. గత కొన్నేళ్లలో కొత్త కొత్త సినిమాలతో మార్పు వైపు వడివడిగా అడుగులేస్తున్న తెలుగు సినిమా ప్రస్థఆనంలో ఇదొక మేలి మలుపు అని చెప్పాలి. కంచరపాలెం అనే ఊరికే చెందిన.. నటనలో అనుభవం లేని వాళ్లు ఇంత బాగా తమ పాత్రల్ని పండించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ విషయంలో దర్శకుడు వెంకటేష్‌ మహాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

సినిమా మొత్తంలో కంచరపాలెంకు చెందిన వాళ్లే 70 మంది దాకా ఉన్నారట. ఒక్కరంటే ఒక్కరు కూడా తెలిసిన నటులు లేరు. అయినా జనాలకు అదేమీ ఇబ్బందిగా అనిపించడం లేదు. ఇలా కొత్త వాళ్లు చేయడమే ‘కేరాఫ్ కంచరపాలెం’లోని అందం అంటున్నాడు నేచురల్ స్టార్ నాని.

విడుదలకు ముందే ‘కేరాఫ్ కంచరపాలెం’ ప్రివ్యూ చూసి.. ఆ రోజు నుంచి సినిమాను ప్రమోట్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్న నాని.. మరోసారి ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడాడు. సినిమా చూసినప్పటి నుంచి పది మందికి సినిమా చూపించాలని.. దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని తనకు అనిపిస్తోందని.. ఇది అంత మంచి సినిమా అని నాని అన్నాడు. ‘కేరాఫ్ కంచరపాలెం’ తనపై చాలా ప్రభావం చూపించిందని అతను చెప్పాడు.

ఈ సినిమాలో ఒక పాత్రను తాను చేసి ఉంటే బాగుండేదనిపించిందని.. కానీ మళ్లీ తాను కనుక అందులో నటిస్తే సినిమా చెడిపోయేది అనిపించిందని నాని చెప్పాడు. తానే కాదు.. తెలిసిన ఏ నటుడు ఈ సినిమాలో నటించినా మరోలా ఉండేదని.. కొత్తవాళ్లు నటించడమే మంచిదైందని నాని చెప్పాడు. తెలుగుదనం అంటే తనకు ఇంతకుముందు ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమానే గుర్తుకొచ్చేదని.. ఇప్పుడు ‘కేరాఫ్ కంచరపాలెం’ కూడా గుర్తుకొస్తోందని నాని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు