మంజులతో మారుతి సినిమా

మంజులతో మారుతి సినిమా

ఎంటర్టైనర్లు తీయడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు మారుతి ఈ గురువారం ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీని ప్రోమోలు ఆకట్టుకున్నాయి. పండగ సీజన్లో వస్తుండటంతో సినిమా మంచి విజయం సాధిస్తుందనే అంచనా వేస్తున్నారు.

మారుతి మామూలుగా ఒక సినిమా చేస్తుండగానే.. తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటుంటాడు. కానీ ఈసారి మాత్రం అతడి తర్వాతి ప్రాజెక్టు విషయంలో ఇంకా ఒక స్పష్టత రాలేదు. విజయ్ దేవరకొండతో మారుతి సినిమా చేయాలని ఆశ పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఐతే ఇంకా దానిపై స్పష్టత రాలేదు. ఐతే ‘శైలజా రెడ్డి అల్లుడు’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన మారుతి.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

1980 నేపథ్యంలో ఒక పల్లెటూరి ప్రేమకథను సినిమాగా తీయాలని చూస్తున్నట్లు మారుతి వెల్లడించాడు. తన కెరీర్లో ఇదో భిన్నమైన సినిమా అవుతుందన్నాడు. ఐతే ఈ చిత్రం ఎవరితో చేసేది అతను చెప్పలేదు. మరోవైపు ఇంతకుముందు ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్ కలిసి ప్రొడ్యూస్ చేసే మరో సినిమాకు తాను దర్శకత్వం వహించాల్సి ఉందన్నాడు.

విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేసే అవకాశాలున్నట్లు కూడా అతను చెప్పాడు. మహేష్ బాబు సోదరి మంజుల ప్రొడక్షన్లో ఒక సినిమా చేయడానికి ఒప్పందం కుదిరినట్లు అతను చెప్పాడు. ఐతే వీటిలో ఏది ముందు మొదలవుతుందన్నది తెలియదని.. ఇంకొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని అతను చెప్పాడు.

మనుషుల్లోని డిజార్డర్ల నేపథ్యంలో సినిమాలు తీయడం తనకిష్టమని.. ఆ కోవలోనే ‘భలే భలే మగాడివోయ్’.. ‘మహానుభావుడు’ చిత్రాలు చేశానని.. భవిష్యత్తులో ఈ తరహా సినిమా ఇంకోటి చేస్తానని మారుతి వెల్లడించాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు