రవిబాబు 150 పంది పిల్లల్ని పెంచాడట

రవిబాబు 150 పంది పిల్లల్ని పెంచాడట

విలక్షణ దర్శకుడు రవిబాబు నుంచి సినిమా వచ్చి చాలా కాలమైంది. చివరగా అతను ‘అవును-2’ సినిమాతో పలకరించాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో రవిబాబు కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది. ఒక పంది పిల్లను ప్రధాన పాత్రలో పెట్టి అతను ‘అదుగో’ అనే సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు దాటింది.

కానీ ఇప్పటిదాకా ఆ చిత్రం బయటికి రాలేదు. మధ్యలో ఒక ఏడాది పాటు అసలు ఆ సినిమా గురించి చర్చే లేదు. ఐతే ఇటీవలే ‘అదుగో’ను మళ్లీ వెలుగులోకి తెచ్చాడు. ఇటీవలే దీని టీజర్ కూడా రిలీజైంది. అది వినోదాత్మకంగా ఉండి.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇంకో మూడు రోజుల్లో ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నారు. సినిమా మొత్తం ఒక పంది పిల్ల పాత్రతో నడిపించడం అంటే సాహసమే. మరి ఈ సాహసాన్ని రవిబాబు ఎలా పూర్తి చేశాడన్నది ఆసక్తికరం.

సినిమా ఎలా నడుస్తుందన్నది ఒకెత్తయితే.. ఈ పంది పిల్లతో రవిబాబు ఎలా షూటింగ్ చేశాడు.. కావాల్సిన హావభావాల్ని ఎలా రాబట్టుకున్నాడు.. దానికి ఎలా శిక్షణ ఇప్పించాడు అన్నదీ ఆసక్తి రేకెత్తించే విషయమే. ఈ విషయంలో రవిబాబు చాలానే కష్టపడ్డాడట. అతడికి అతి పెద్ద కష్టం.. పంది పిల్ల రూపాన్ని ఒకేలా మెయింటైన్ చేయడంలోనే వచ్చిందట. ఒక పంది పిల్లకు కొంచెం శిక్షణ ఇప్పటించి కొన్ని సీన్లు తీయగానే అది బరువు పెరిగి.. రూపం మారిపోయేదట.

పంది పిల్లలు చాలా వేగంగా పెరుగుతాయని ఈ సినిమా షూటింగ్ చేసేటపుడే తెలిసిందని.. షూటింగ్ కూడా చాలా కాలం సాగడంతో చాలా ఇబ్బంది అయిందని.. ఈ క్రమంలో ఏకంగా 150 పంది పిల్లల్ని పెంచి.. వీలున్నపుడు ఒక్కోదాంతో షూటింగ్ చేయాల్సి వచ్చిందని రవిబాబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మరి ఇన్ని పంది పిల్లల్ని పెంచి.. వాటితో యూనిఫార్మిటీ తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. మరి సినిమాలో అదెలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు