నయనతార కాదు.. కాజల్ అగర్వాల్

నయనతార కాదు.. కాజల్ అగర్వాల్

మూడేళ్ల కిందట దక్షిణాది సినీ ప్రేక్షకుల్ని ఊపేసిన సినిమా ‘తనీ ఒరువన్’. తమిళంలో జయం రవి హీరోగా అతడి అన్న మోహన్ రాజా రూపొందించిన ఈ చిత్రం పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై భారీ విజయం సాధించింది. ఇతర భాషల ఫిలిం మేకర్లను ఈ సినిమా విస్మయానికి గురి చేసింది. ఒక కమర్షియల్ సినిమాను ఇంత పకడ్బందీగా.. ఇలాంటి ఇంటలిజెంట్ స్క్రీన్ ప్లేతో తీయడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ చిత్రం తెలుగులో ‘ధృవ’ పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడా ఆ చిత్రం మంచి హిట్టయింది. ఇప్పుడు ‘తనీ ఒరువన్’కు సీక్వెల్ రాబోతోంది.

‘తనీ ఒరువన్’ తర్వాత ‘వేలైక్కారన్’ అనే సినిమాతో మరో హిట్ కొట్టిన మోహన్ రాజా.. ఇటీవలే తన తమ్ముడితోనే ‘తనీ ఒరువన్-2’ తీయబోతున్నట్లు చెప్పాడు. దీంతో ఈ ప్రాజెక్టుపై వెంటనే అంచనాలు పెరిగిపోయాయి. ఈసారి బడ్జెట్ ఇబ్బందులు కూడా లేకపోవడంతో మరింత భారీగా సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు మోహన్.

‘తనీ ఒరువన్’లో నయనతార కథానాయికగా నటించింది. ఆమె పాత్ర సినిమాకు ప్లస్ అయింది. నయనతారకు కూడా ఆ పాత్ర మంచి పేరే తెచ్చింది. ఐతే ‘తనీ ఒరువన్-2’లో రవినే హీరో కాబట్టి నయనతార పాత్రను కొనసాగిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. ఇందులో హీరోయిన్ పాత్రకు ఈసారి కాజల్ అగర్వాల్‌ను తీసుకోబోతున్నారట. ఇలా సీక్వెల్స్‌లో హీరోను కొనసాగించి.. హీరయిన్ని మార్చేయడం బాలీవుడ్లోనూ జరుగుతుంటుంది.

హీరోయిన్ సంగతలా వదిలేస్తే.. ‘తనీ ఒరువన్’కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన అరవింద్ స్వామి పాత్ర ఇందులో ఉంటుందా లేదా.. అతనే ఈ పాత్రను చేస్తాడా లేదా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అరవింద్ స్వామి లేకుంటే మాత్రం ప్రేక్షకులు కచ్చితంగా డిజప్పాయింట్ అవుతారు. ఐతే స్క్రిప్టు పూర్తయ్యాకే ఈ విషయంలో మోహన్ రాజా స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు