క్రౌడ్ సినిమా.. మళ్లీ పంచ్

క్రౌడ్ సినిమా.. మళ్లీ పంచ్

క్రౌడ్ ఫండింగ్‌తో సినిమా తీయడం ఇండియాలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. షార్ట్ ఫిలిమ్స్ తీయడం ద్వారా తమ టాలెంట్ చూపించి.. సామాజిక మాధ్యమాల్లోని తమ మిత్రుల ఆర్థిక సహకారంతో సినిమాలు తీస్తూ మెప్పిస్తున్నారు యంగ్ ఫిలిం మేకర్స్. కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘తిథి’ సినిమా ఇలా తయారైందే. తెలుగులో కూడా ఇలాంటి ప్రయత్నాలు గతంలో కొన్ని జరిగాయి.

తెలుగులో తొలి క్రౌడ్ ఫండెడ్ మూవీ తీసింది మహేష్ కత్తి కావడం విశేషం. ఆయన సోషల్ మీడియా ఫ్రెండ్స్ సమకూర్చిన డబ్బులతో ‘పెసరట్టు’ అనే సినిమా తీశాడు. కానీ అది దారుణమైన ఫలితాన్నందుకుంది. దాన్ని విమర్శకులు చెత్త సినిమాగా ముద్ర వేశారు. అసలా చిత్రం వచ్చింది వెళ్లింది కూడా తెలియదు. తొలి క్రౌడ్ ఫండెడ్ మూవీ ఇలా తయారవడంతో ఈ ట్రెండు ఊపందుకోలేదు.

కొన్నేళ్ల తర్వాత ‘మధురం’ షార్ట్ ఫిలింతో పేరు సంపాదించిన ఫణీంద్ర నరిశెట్టి క్రౌడ్ సాయంతో ‘మను’ సినిమా మొదలుపెట్టాడు.  కేవలం నాలుగు రోజుల్లో కోటి రూపాయలకు పైగా ఈ సినిమా కోసం పోగవడం విశేషం. దాన్ని బట్టి జనాలకు ఫణీంద్రపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత సపోర్ట్‌ తీసుకుని ఫణీంద్ర తీసిన ‘మను’ మంచి ఫలితాన్నందుకుంటుందని అంతా అనుకున్నారు.

దీని ప్రోమోలు సినిమాపై నమ్మకం కలిగించాయి. కానీ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నప్పటికీ సినిమా వినోదాత్మకంగా లేకపోవడం, జనాలకు అర్థమయ్యేలా సరళంగా కథను చెప్పకపోవడం, నిడివి ఏకంగా మూడు గంటలుండటం దీనికి ప్రతికూలమైంది.

అసలే ఓపెనింగ్స్ లేకపోగా.. టాక్ కూడా బ్యాడ్‌గా ఉండటంతో సినిమా పుంజుకోలేదు. జనాల పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. ‘పెసరట్టు’ తర్వాత ‘మను’ సైతం తేడా కొట్టేయడంతో మున్ముందు ఇలా క్రౌడ్ సపోర్టుతో సినిమాలు తీయాలనుకున్న వాళ్లకు ఇబ్బందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English