గీతా ఆర్ట్స్ వ్యూహంపై అనుమానం

గీతా ఆర్ట్స్ వ్యూహంపై అనుమానం

‘గీత గోవిందం’ సినిమాతో మామూలు విజయాన్నందుకోలేదు ‘గీతా ఆర్ట్స్’. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసిన ఆ సంస్థ ఇప్పుడు రూ.40-50 కోట్ల మధ్య లాభాలు అందుకుంటున్నట్లు అంచనా. నష్టాలు మూటగట్టుకుంటున్నవాళ్లు తమ సినిమాల వసూళ్ల గురించి ఊదరగొట్టుకుంటున్న రోజులివి. కానీ అల్లు అరవింద్ టీం మాత్రం వసూళ్ల విశేషాలే వెల్లడించట్లేదు. కానీ బాక్సాఫీస్ ట్రెండ్స్ చూస్తే ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధించిందో అర్థమవుతోంది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్.. రూ.60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంచలనం సృఫ్టించిందా చిత్రం. ఇంకా కూడా ఆ సినిమా జోరు ఆగట్లేదు. చాలా ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేయడం ద్వారా భారీగా ఆదాయం అందుకుంది ‘గీతా ఆర్ట్స్’. ఇంకా డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్, రీమేక్ హక్కుల ద్వారా కూడా భారీగా డబ్బలుు అందుతున్నాయి.

ఇలాంటి విజయాన్నందుకున్న తర్వాత ‘గీతా ఆర్ట్స్’ టీం వేస్తున్న అడుగులు ఆశ్చర్యం కలిగిస్తోంది. చాలా సాధారణమైన సినిమా అయిన ‘పేపర్ బాయ్’ని చూసి మెప్పి అల్లు అరవింద్ తన బేనర్ మీద రిలీజ్ చేయడమేంటో అర్థం కాలేదు. సినిమాలో అంత విషయం కూడా లేదాయె. ఇలాంటి చిత్రాన్ని ఆయనెందుకు టేకప్ చేశారో అర్థం కాలేదు. దీనికి సరైన ప్రమోషన్లు కూడా చేయలేదు. రిలీజ్ తర్వాత నెగెటివ్ టాక్ వచ్చినా పట్టించుకోలేదు. దీంతో ‘గీత గోవిందం’ ద్వారా వచ్చిన ఆదాయంతో ఆదాయపు పన్ను భారీగా కట్టాల్సి వస్తుందని.. అందులో కోత వేయించుకునేందుకు నష్టాలు చూపించడానికి ఈ సినిమాను తమ చేతుల్లోకి తీసుకున్నారన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

ఈ సందేహాలకు బలం చేకూరుస్తూ ఇప్పుడు మరో చిన్న సినిమాను ‘గీతా ఆర్ట్స్’ టేకప్ చేసింది. అదే.. ఈ మాయ పేరేమిటో. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా పరిచయం కానున్న సినిమా ఇది. రిలీజ్ చేయడానికి చాలా రోజులుగా చూస్తున్నారు కానీ.. బిజినెస్ కావట్లేదు. ఇలాంటి సినిమాను గీతా ఆర్ట్స్ కొనుక్కోవడం వెనుక వ్యూహమేంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ అడుగులు చూస్తుంటే.. ఇండస్ట్రీ జనాల సందేహాలే నిజమనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English