పాపం టాలెంట్ ఉంది కానీ..

పాపం టాలెంట్ ఉంది కానీ..

‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో స్కూల్ టీం కెప్టెన్ పాత్రలో నటించిన కుర్రాడిని చూసి.. చిన్న వయసులోనే ఇతనెవరో బాగా చేస్తున్నాడే అనిపించింది ప్రేక్షకులకు. ఆ తర్వాత ‘బంగారు కోడిపెట్ట’ అనే సినిమాలోనూ ఆ కుర్రాడు ఆకట్టుకున్నాడు. కానీ ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో అతడి టాలెంట్ జనాలకు తెలియలేదు. ఆపై ‘తను నేను’ అనే సినిమాలో కథానాయకుడిగా నటించాడు. అందులోనూ అతడి నటన ఆకట్టుకుంది కానీ.. సినిమా ఆడలేదు. నిజానికి ఆ సినిమా ముందు వరకు అతడి పేరు.. నేపథ్యం కూడా జనాలకు తెలియదు. ఐతే త్రివిక్రమ్, కృష్ణవంశీ లాంటి పెద్ద దర్శకులు ఆ సినిమాను ప్రమోట్ చేస్తూ ఆ కుర్రాడు ఎవరన్నది అందరికీ తెలియజెప్పారు. మహేష్ బాబు సినిమా ‘బాబి’తో దర్శకుడిగా పరిచయమై.. ఆపై ‘వర్షం’తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శోభన్ కొడుకే ఈ కుర్రాడు. పేరు.. సంతోష్ శోభన్. శోభన్ చాలా ఏళ్ల కిందటే గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

తండ్రిని కోల్పోయినప్పటికీ అధైర్య పడకుండా ఆత్మవిశ్వాసంతో సినిమాల్లో అడుగులు వేశాడు సంతోష్. తాజాగా అతను ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయంలో సంతోష్ సహజమైన నటనే. ఆత్మవిశ్వాసం ఉన్న పేదింటి కుర్రాడిగా అతడి నటన అందరినీ ఆకట్టుకుంది. చూసిన వాళ్లందరూ సంతోష్ నటన గురించి పొగిడిన వాళ్లే. ఎంతో పరిణతితో.. సహజంగా ఆ పాత్రను పోషించాడతను. బాడీ లాంగ్వేజ్.. నటన.. డైలాగ్ డెలివరీ అన్నీ బాగున్నాయి. కుర్రాడి లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ అతడి టాలెంటుకి తగ్గ మంచి సినిమా పడకపోవడం శాపమవుతోంది. శోభన్ ఇండస్ట్రీలో చాలామందికి ప్రముఖులకు సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతో సంతోష్ సినిమాల ప్రమోషన్‌కు సహకారమందించారు. ఐతే ఇంతటితో సరిపెట్టకుండా సంతోష్ టాలెంటుకి తగ్గ పాత్రలతో అతడికి అవకాశాలిస్తే అతను తనేంటో రుజువు చేసుకుంటాడు. నటుడిగా నిలదొక్కుకుంటాడు. మరి ఆ అవకాశాలు ఇచ్చేదెవరో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు