మగధీర మోత మోగించేస్తోంది

మగధీర మోత మోగించేస్తోంది

రామ్ చరణ్ కెరీర్లో మైలురాయిలా నిలిచిన సినిమా ‘మగధీర’. 2009లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో అసాధారణ విజయాన్నందుకుంది. రాజమౌళి విజువల్ మ్యాజిక్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వసూళ్ల వర్షం కురిపించారు. తెలుగు సినిమా కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందీ చిత్రం. దీన్ని ఆ తర్వాత తమిళ, హిందీ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. అక్కడా మంచి విజయాన్నందుకుంది.

ఈ చిత్రం ఇన్నేళ్ల విరామం తర్వాత జపనీస్ భాషలోకి అనువాదం కావడం విశేషం. గతద శుక్రవారం జపాన్‌లో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే ‘మగధీర’ అక్కడ 1.06 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ‘బాహుబలి: ది కంక్లూజన్’కు సైతం ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఆ చిత్రం ఫుల్ రన్లో 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ మార్కును ‘మగధీర’ అలవోకగా దాటేసేలా ఉంది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ‘ముత్తు’ రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రం అప్పట్లోనే 3.08 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఆ రికార్డు దాదాపు రెండు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉంది.

‘మగధీర’ ఓపెనింగ్స్ చూస్తే దానికి చేరువగా వెళ్లేలా కనిపిస్తోంది. కనీసం రెండో స్థానం అయితే ఖాయం. ప్రస్తుతం ‘3 ఇడియట్స్’ 1.5 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. ‘మగధీర’కు ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి ‘బాహుబలి-2’నే కారణం. ఆ చిత్రం జపాన్‌లో మంచి స్పందన రాబట్టుకుంది. రాజమౌళిపై అక్కడి జనాలకు బాగా గురి కుదిరింది. జక్కన్న సినిమా అనే ‘మగధీర’పై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత వసూళ్లు రాబడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English