‘అజ్ఞాతవాసి’పై అను ఇమ్మాన్యుయెల్ కామెంట్

‘అజ్ఞాతవాసి’పై అను ఇమ్మాన్యుయెల్ కామెంట్

‘అజ్ఞాతవాసి’ సినిమా మీద చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు. అందులో హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ ఒకరు. తెలుగులో ముందు ‘మజ్ను’.. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి చిన్న సినిమాలు చేసిన అను.. ఒకేసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రంలో కథానాయికగా అవకాశం దక్కేసరికి గాల్లో తేలిపోయింది. ఈ సినిమాతో తన రేంజే మారిపోతుందని అనుకుంది. కానీ ఆ సినిమా ఆమె ఆశలపై గట్టి దెబ్బే కొట్టింది. అను కెరీర్లో తొలి డిజాస్టర్ జమ చేసింది. తన కొత్త సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన అను.. ‘అజ్ఞాతవాసి’ ఫలితంపై స్పందించింది. ఆ సినిమా తనను ఎంతో నిరాశకు గురి చేసిన మాట వాస్తవమే అని ఆమె చెప్పింది.


రెండో హీరోయిన్ అయినప్పటికీ ఈ సినిమా ఒప్పుకోవడంపై మాట్లాడుతూ.. కథ బాగుందని, తన పాత్రకు కూడా ప్రాధాన్యం ఉందని అనిపించాకే తానీ సినిమా ఒప్పుకున్నట్లు అను చెప్పింది. స్క్రిప్టు విన్నాక ‘అత్తారింటికి దారేది’లో ప్రణీత తరహాలో తన పాత్రను తయారు చేస్తారా అని త్రివిక్రమ్‌ను అడిగానని.. అలాంటిదేమీ లేదని, మంచి పాత్ర అని ఆయన తనకు హామీ ఇచ్చాడని అను చెప్పింది. ఈ సినిమాకు నో చెప్పడానికి తనకు కారణాలు దొరకలేదని.. అన్నీ తెలిసే ఈ చిత్రం ఒప్పుకున్నానని అను చెప్పింది. దేనికైనా అదృష్టం కలిసి రావాలని.. ‘అజ్ఞాతవాసి’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ కీర్తి సురేష్ ఆ తర్వాత నటించిన ‘మహానటి’ పెద్ద విజయం సాధించిందని.. ఆమెకు గొప్ప పేరు కూడా వచ్చిందని.. ఒక సినిమాతో ఎవరి జాతకం అయినా మారిపోతుందనడానికి ఇది రుజువని.. ‘శైలజారెడ్డి అల్లుడు’ తన కెరీర్‌ను కూడా మలుపు తిప్పుతుందని ఆశిస్తున్నానని అను అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు