ప్రభాస్ 20 మొదలైపోయిందహో

ప్రభాస్ 20 మొదలైపోయిందహో

మొత్తానికి ప్రభాస్ కొత్త సినిమా విషయంలో సందిగ్ధతకు తెరపడింది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రం గురువారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. పెద్దగా హడావుడి లేకుండా.. మీడియా వాళ్లు కూడా లేకుండా సింపుల్‌గా ప్రారంభోత్సవం కానిచ్చేశారు. కేవలం ప్రారంభోత్సవం మాత్రమే కాదు.. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. యూరోప్‌లో తొలి షెడ్యూల్ షూట్ చేయనున్నారు. విశేషం ఏంటంటే.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ షూటింగ్ కూడా ఇదే సమయంలో యూరప్‌లో జరగనుంది. ఈ రెండు చిత్రాలనూ నిర్మిస్తున్నది ప్రభాస్ మిత్రులైన ‘యువి క్రియేషన్స్’ అధినేతలు వంశీ, ప్రమోద్‌లే. రెండు సినిమాలకూ యూరప్ షెడ్యూళ్లు కీలకం.

యూరప్‌లో షూటింగ్ అంటే ఖర్చుతో,. శ్రమతో కూడుకున్న వ్యవహారం. అందుకే రెండు చిత్రాల షెడ్యూళ్లనూ ఒకేసారి ప్లాన్ చేశారట. ప్రభాస్ డేట్ల విషయంలో ఇబ్బందేమీ లేదు కాబట్టి.. సర్దుబాటు చేసుకుని ఒకేసారి రెండు సినిమాల షెడ్యూళ్లూ ముగించుకుని రాబోతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయేది ఫక్తు ప్రేమకథ అని సమాచారం. ఇది పునర్జన్మ నేపథ్యంలో సాగుతుందని కూడా అంటున్నారు. అదెంత వరకూ నిజమో కానీ.. ‘జిల్’ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించిన చంద్రశేఖర్ యేలేటి శిష్యుడు.. ప్రభాస్‌తో జత కడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ‘సాహో’ను వచ్చే ఏడాది వేసవికి అనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు