'బిగ్ బాస్' షోలో ఆ క్రికెటర్

'బిగ్ బాస్' షోలో ఆ క్రికెటర్

తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ ముగింపు దశలో ఉంది. తమిళ బిగ్ బాస్ రెండో సీజన్ మధ్యలో ఉంది. ఇప్పుడిక హిందీ బిగ్ బాస్ హంగామా మొదలు కాబోతోంది. 11 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఈ షో.. 12వ సీజన్‌తో ప్రేక్షకుల ముందకు రానుంది. ఈసారి షోను మరింత రక్తి కట్టించడం కోసం పెద్ద స్థాయి కంటెస్టెంట్లను షోలోకి తీసుకు రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టిసిపెంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఒక జాబితా హల్ చల్ చేస్తోంది. అందులో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న పేరు.. శ్రీశాంత్. భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు కీలక ఆటగాడిగా ఉన్న ఈ కేరళ ఫాస్ట్ బౌలర్.. 2013 ఐపీఎల్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఆటకు దూరమయ్యాడు.

కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపి వచ్చిన శ్రీశాంత్.. బీసీసీఐ నిషేధానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడే అవకాశాలు దాదాపు లేవు. అతను కూడా ఆటను వదిలేసి వేరే వ్యాపకాలపై దృష్టిపెట్టాడు. ఒక సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడతను ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ కాబోతున్నాడు. ఆటలో ఉన్నన్నాళ్లూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వచ్చిన శ్రీశాంత్.. ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఏదో ఒక కాంట్రవర్శీ క్రియేట్ చేయకుండా ఉండడు. అందుకే అతడిని ఎంచుకున్నట్లుంది. విశేషం ఏంటంటే.. ఈసారి పార్టిసిపెంట్లలో ఒక పోర్న్ స్టార్ కూడా ఉన్నాడంటున్నారు. అతడి పేరు డానీ డి. అతను బ్రిటిష్ పోర్న్ స్టార్. అలాగే ఒకప్పటి హాట్ హీరోయిన్ తనూశ్రీ దత్తా కూడా షోలో పాల్గొంటుందట. వీరితో పాటు భారతి సింగ్, హర్ష్ లింబచియా, టినా దత్తా, ఇషితా, దీపికా కాకర్, కరణ్ వీర్ బోరా, మహిక శర్మ, స్కార్లెట్ ఎం రోజ్, సృష్టి రోడె, షలీన్ బానోత్, సుబుహి జోషి ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి రాబోతున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు