రాజమౌళితో వియ్యం.. జగపతి ఫుల్ హ్యాపీ

రాజమౌళితో వియ్యం.. జగపతి ఫుల్ హ్యాపీ

టాలీవుడ్లో ఇంకో ఇద్దరు ప్రముఖులు ఓ పెళ్లి ద్వారా బంధువులుగా మారారు. దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ.. పూజ అనే అమ్మాయిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రే సింపుల్‌గా వీరి నిశ్చితార్థ వేడుకను ముగించారు. పూజ జగపతిబాబు సోదరుడు రామ్ ప్రసాద్ తనయురాలు కావడం విశేషం. ఇలా రాజమౌళి-జగపతి వియ్యంకులుగా మారుతున్నారు. విశేషం ఏంటంటే.. ఇన్నేళ్ల కెరీర్లో జగపతిబాబు రాజమౌళితో ఒక్కసారి కూడా పని చేయలేదు. రెండో ఇన్నింగ్స్‌లో విలన్, క్యారెక్టర్ రోల్స్‌తో చెలరేగిపోతున్న జగపతి.. రాజమౌళితో పని చేయాలన్న ఆసక్తి చూపించాడు కానీ.. ఇంకా ఆ అవకాశం దక్కలేదు. ఐతే రాజమౌళిపై తనకున్న అభిమానాన్ని.. గౌరవాన్ని కొన్ని రోజుల కిందటే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

జీవితాన్ని ఎలా గడపాలో రాజమౌళి కుటుంబాన్ని చూసి అందరూ నేర్చుకోవాలని జగపతి అన్నాడు. మనం లేని పోని టెన్షన్లను.. కష్టాల్ని నెత్తిన పెట్టుకుని బాధ పడుతుంటామని.. కానీ రాజమౌళి కుటుంబం అలా కాదని.. చాలా సింపుల్ గా సంతోషంగా జీవితాన్ని గడుపుతుందని.. ఆ కుటుంబంలో ఏ ఒక్కరో అని కాకుండా ప్రతి ఒక్కరూ అందమైన జీవితాన్ని గడుపుతారని.. వాళ్లను చూసి తాను చాలా ఇంప్రెస్ అయ్యానని.. అందరూ వారి నుంచి స్ఫూర్తి పొందాలని జగపతి అన్నాడు. జక్కన్న కుటుంబాన్ని చూసి ఇలా ఇంప్రెస్ అయ్యాడు కాబట్టే జగపతి వారితో సంబంధం కలుపుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమా.. లేక ప్రేమ వివాహమా అన్నది వెల్లడికాలేదు. ఆ వివరాలు త్వరలోనే బయటికి వచ్చే అవకాశముంది. ఐతే ఈ సంబంధం విషయంలో ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వివాహ వేడుక జరపనున్నారు. ఇరు కుటుంబాలు సింప్లిసిటీని ఇష్టపడతాయి కాబట్టి అందుకు తగ్గట్లే పెళ్లి జరిగే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English