విజయ్ దేవరకొండ.. సీఎంయేనా?

విజయ్ దేవరకొండ.. సీఎంయేనా?

తెరమీద రాజకీయ నాయకుడిగా నటించడం ఏ నటుడికైనా ప్రత్యేకమైన అనుభూతినిచ్చేదే. అందులోనూ ముఖ్యమంత్రి పాత్ర చేయడం.. ప్రేక్షకుల ఆదరణ సంపాదించడం మరింత ప్రత్యేకం. స్టార్ హీరోల్లో చాలా కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. ‘ఒకే ఒక్కడు’లో అర్జున్.. ‘లీడర్’లో దగ్గుబాటి రానా.. ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబు సీఎం పాత్రల్లో తమదైన ముద్ర వేశారు. ప్రేక్షకుల మనసు గెలిచారు. ఇప్పుడు మరో యంగ్ హీరో సీఎం పాత్రలో కనిపించబోతున్న సంకేతాలు వస్తున్నాయి. ‘పెళ్ళిచూపులు’.. ‘అర్జున్ రెడ్డి’.. ‘గీత గోవిందం’ చిత్రాలతో తిరుగులేని విజయాల్ని అందుకున్న విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘నోటా’లో ముఖ్యమంత్రి పాత్రే చేస్తున్నాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. గురువారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ రోజు 30 సెకన్ల స్నీక్ పీక్ వదిలారు.


అందులో చూపించిన సన్నివేశాల్ని బట్టి చూస్తే విజయ్ ఇందులో రాజకీయ నాయకుడి అవతారంలో కనిపించబోతున్నాడని స్పష్టమైంది. అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లో అడుగుపెట్టి పెద్ద స్థాయికి ఎదిగేలా కనిపిస్తున్నాడు. ఒక సన్నివేశంలో అతను సెక్రటేరియట్ ముందు దిగి పైకి చూడటం కనిపిస్తోంది. అతడి చుట్టూ పెద్ద ఎత్తున సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే అతను ముఖ్యమంత్రి పాత్ర చేస్తున్నట్లే కనిపిస్తోంది. అలా కాకుంటే కనీసం మంత్రి క్యారెక్టర్ అయినా చేస్తుండాలి. ఐతే హీరోల్ని సాధారణంగా ముఖ్యమంత్రిగానే చూపిస్తారు. మంత్రి పాత్రకు పరిమితం చేయరు. కాబట్టి విజయ్‌ని సీఎంగా చూడబోతున్నామనే భావించాలి. ఈ సస్పెన్సుకి బుధవారం సాయంత్రం తెరపడనుంది. ట్రైలర్లో అసలు విషయం రివీల్ చేయకుండా పోరు. స్నీక్ పీక్ చూస్తే ఇది ఇంటెన్స్ పొలిటికల్ మూవీలాగే ఉంది. విజయ్ ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మరోసారి ఇంటెన్స్ క్యారెక్టర్లో సంచలనం రేపడానికి రెడీ అవుతున్నట్లే ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు