'అరవింద సమేత' మీదికి వదిలేస్తున్నారే..

'అరవింద సమేత' మీదికి వదిలేస్తున్నారే..

తెలుగులో భారీ సినిమాల మోత వేసవితోనే ముగిసిపోయింది. ద్వితీయార్దం మొత్తానికి మిగిలిన ఏకైక భారీ చిత్రం ‘అరవింద సమేత’. జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పోటీగా వెళ్లడానికి తెలుగులో మరే చిత్రం సాహసించడం లేదు. ముందు, వెనుక వారాల్లో మాత్రం వేరే చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి. దీంతో ‘అరవింద సమేత’ సోలో బ్యాటింగ్ పక్కా అని అంతా అనుకుంటున్నారు. కానీ దానికి పోటీగా ఓ ఆసక్తికర చిత్రం విడుదలకు విడుదలకు సిద్ధమైంది. అదే.. భైరవ గీత. ‘అరవింద సమేత’ అక్టోబరు 11న రాబోతుండగా.. మరుసటి రోజు ‘భైరవగీత’ రిలీజ్ కానుంది.

రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో సిద్దార్థ అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రం ‘భైరవ గీత’. దీని గురించి వర్మ కొంత కాలంగా చాలా గొప్పగా చెబుతున్నాడు. వర్మ చెప్పిన స్థాయిలో కాకపోయినా ‘భైరవ గీత’ ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగానే అనిపించింది. వర్మ కెరీర్లో మైలురాయిలా నిలిచిన ‘రక్తచరిత్ర’ ఛాయలు ఇందులో కనిపించాయి. ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే రివెంజ్ సినిమాలా ఉంది ‘భైరవగీత’. కథలో కొత్తదనం లేకపోయినా టేకింగ్ పరంగా మాత్రం ప్రత్యేకత కనిపించింది. ఈ కర్ణాటకలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ధనంజయ.. ఐరా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు.. కన్నడ రెండు భాషల్లోనూ రూపొందించారు. ఇందులో యాక్షన్ ఘట్టాలు.. బోల్డ్ సీన్స్ ఆయా వర్గాల ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే ‘అరవింద సమేత’ లాంటి భారీ సినిమాకు పోటీగా రానున్న ఈ చిత్రం దాని ధాటిని ఎలా తట్టుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు