సిల్లీ ఫెలోస్.. సిల్లీ సంగతులు

సిల్లీ ఫెలోస్.. సిల్లీ సంగతులు

ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘సిల్లీ ఫెలోస్’. హిట్టు కోసం ముఖం వాచిపోయిన అల్లరి నరేష్.. సునీల్ లకు ఈ చిత్రం ఎంతో కీలకం. సునీల్ అయినా కామెడీ పాత్రలకు మారిపోయాడు. ఈ చిత్రంలో అతను చేస్తున్నది కూడా హీరో పాత్ర కాదు. నిడివి ఎక్కువున్న కమెడియన్ పాత్రే. కాబట్టి అతడి కంటే అల్లరోడికే ఈ చిత్రం ఎంతో కీలకం.

ఈ చిత్ర ట్రైలర్ చూస్తే కొత్తదనం ఏమీ కనిపించలేదు. కామెడీ చాలా లౌడ్ గా ఉండేలా కనిపిస్తోంది. ఈ తరహా కామెడీని ఇప్పటి ప్రేక్షకులు ఏమాత్రం ఆదరిస్తారో అన్న సందేహాలున్నాయి. ఈ సంగతలా ఉంచితే.. చిత్ర బృందం ఇన్నాళ్లూ దాచి పెట్టిన ఒక విషయం తాజాగా బయటికి వచ్చేసింది. ఇది ‘వేలైను వంద వేలైక్కారన్’ అనే తమిళ హిట్ మూవీకి రీమేక్ అట. భీమనేని అంటేనే రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఐతే ఎఫ్పుడూ తాను ఏ సినిమాను రీమేక్ చేసింది ముందే చెబుతుంటాడతను.

కానీ ఈసారి మాత్రం ఆ విషయం చెప్పలేదు. ఇందుకు కారణం లేకపోలేదు. ‘వేలైను వంద వేలైక్కారన్’ ఇప్పటికే తెలుగులో అనువాదం అయి విడుదల కూడా అయింది. ‘ప్రేమ లీల.. పెళ్ళిగోల’ పేరుతో కొన్ని నెలల కిందటే ఆ చిత్రాన్ని రిలీజ్ చేశారు. చిత్ర బృందం ఇక్కడికి వచ్చి సినిమాను ప్రమోట్ చేసింది కూడా. కాకపోతే ఆ చిత్రం వచ్చింది వెళ్లింది ఎవరికీ తెలియదు.

మరి సినిమాను రీమేక్ చేస్తున్న వాళ్లు డబ్బింగ్ చిత్రాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారో ఏమో? ఐతే ఆ చిత్రం గురించి తెలుగు జనాలకు పెద్దగా తెలియదు కాబట్టి లైట్ తీసుకోవచ్చు. తమిళంలో ఈ చిత్రానికి కమెడియన్ సూరి చేసిన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అది పూర్తి స్థాయి కామెడీ పాత్ర. దాన్నే తెలుగులో సునీల్ చేస్తున్నాడు. కానీ సునీల్ కామెడీ ఇమేజ్ దెబ్బ తినేసిన నేపథ్యంలో ఇప్పుడతను ఏమాత్రం కామెడీ పండిస్తాడు.. ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు