‘గూఢచారి’ దర్శకుడికి ఛాన్సిచ్చారు

‘గూఢచారి’ దర్శకుడికి ఛాన్సిచ్చారు

ఈ మధ్య టాలీవుడ్‌ను ఆశ్చర్యానికి గురి చేసిన చిత్రాల్లో ‘గూఢచారి’ ఒకటి. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్లో అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గని థ్రిల్లర్ మూవీని అందించింది ‘గూఢచారి’ టీం. ఈ విషయంలో అక్కినేని నాగార్జున అంతటి వాడు మెస్మరైజ్ అయిపోయాడు. చిత్ర బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘గూఢచారి’తో శశికిరణ్ తిక్క అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

న్యూయార్క్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఫిలిం డైరెక్షన్ కోర్సు చేసి టాలీవుడ్లో తొలి అవకాశం కోసం ప్రయత్నిస్తున్న శశికి అడివి శేష్ అవకాశమిచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక ప్రత్యేకమైన థ్రిల్లర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఐతే అడివి శేష్‌ ఇంతకుముందు చేసిన ‘క్షణం’ తరహాలోనే ‘గూఢచారి’ విజయంలో కూడా మేజర్ క్రెడిట్ అతడికే వెళ్లిపోయింది.

‘క్షణం’ దర్శకుడు రవికిరణ్ పేరెపు ఇప్పటిదాకా తన కొత్త సినిమాను మొదలుపెట్టలేకపోయాడు. శశికిరణ్ పరిస్థితి కూడా ఇలాగే అవుతుందేమో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. శశి వెంటనే మంచి అవకాశం అందుకున్నాడు. టాలీవుడ్లో మాంచి ఊపుమీదున్న బేనర్లలో ఒకటైన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లో అతను తన కొత్త సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ ఒక లైన్ చెప్పి మెప్పించిన శశి.. ఆ సంస్థ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట.

ఇంకా ఈ చిత్రానికి కథానాయకుడు ఖరారవ్వలేదు. ఫుల్ స్క్రిప్టు రెడీ అయ్యాక హీరో ఎవరో తేలుతుంది. సితార పేరున్న బేనరే కావడంతో మీడియం రేంజి హీరోతో సినిమాచేసే అవకాశం వస్తుందని శశి ఆశిస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక మళ్లీ అడివి శేష్‌తో ‘గూఢచారి’ సీక్వెల్ చేయాలని శశికరణ్ భావిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు