సునీల్ మాట మార్చేశాడే..

సునీల్ మాట మార్చేశాడే..

కమెడియన్ కమ్ హీరో సునీల్ అవసరానికి తగ్గట్లు బాగానే మాటలు మార్చేస్తున్నాడు. కమెడియన్‌గా బ్రహ్మాండమైన కెరీర్ వదులుకుని హీరోగా మారిన సునీల్.. మొదట్లో మంచి విజయాలే అందుకున్నాడు. కానీ ఆ తర్వాత అతడి కెరీర్ గాడి తప్పింది. వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. అటు కమెడియన్‌గా కెరీర్ దెబ్బ తిని.. హీరోగా కెరీర్ సజావుగా సాగక బాగా ఇబ్బంది పడిపోయాడు.

ఐతే హీరోగా స్ట్రగులవుతున్నపుడు.. ఇక ఇవి మానేసి తిరిగి కామెడీ క్యారెక్టర్లు చేయొచ్చు కదా అని సునీల‌్‌ను అడిగితే.. ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చాడు సునీల్. కామెడీ క్యారెక్టర్లు చేసి అలసిపోయానని.. రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో పని చేశానని.. చాలా కష్టం అనిపించేదని.. వేరే వాళ్లతో తన డేట్లు సర్దుబాటు కాక సమస్యలు తలెత్తేవని.. ఇప్పుడు ఆ ఇబ్బందులేమీ లేకుండా హీరోగా తన సినిమాలేవో తాను చేసుకుంటున్నానని.. హీరోగా చేస్తుండటంతో అన్ని విషయాలూ తన చేతిలోనే ఉంటున్నాయని సునీల్ తెలిపాడు.

కానీ హీరో వేషాలకు తెరదించేసి మళ్లీ కామెడీ పాత్రల వైపు మళ్లిన సునీల్.. ఇప్పుడు కొత్త స్వరం వినిపిస్తున్నాడు. తన వరకు కామెడీ క్యారెక్టర్లు చేయడమే చాలా సంతోషమని అతనన్నాడు. హీరోగా చేయలేని వైవిధ్యమైన పాత్రలెన్నో కమెడియన్‌గా చేయొచ్చని అతనన్నాడు. తాను హీరోగానే కొనసాగాలని ఎప్పుడూ అనుకోలేదని.. ‘అందాల రాముడు’ తర్వాత చాలా అవకాశాలు వచ్చినా అంగీకరించలేదని.. కానీ ‘మర్యాదరామన్న’ ఆడాక నమ్మకం కుదిరి హీరోగా కంటిన్యూ అయ్యానని అతను చెప్పాడు.

హీరోగా చేస్తుండటంతో కామెడీ క్యారెక్టర్ల కోసం అడగడం మానేశారని.. అంతే తప్ప తనకు తానుగా కామెడీ క్యారెక్టర్లు వద్దని అనుకోలేదని అన్నాడు సునీల్. మొత్తానికి మారిన పరిస్థితులకు తగ్గట్లు సునీల్ సింపుల్‌గా మాట మార్చేశాడంటూ ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు